రైతు ద్రోహి చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

రైతు ద్రోహి చంద్రబాబు

Jun 14 2026 10:07 AM | Updated on Jun 14 2026 10:07 AM

వెన్నుపోటుపై నిరసనలు విజయవంతం

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

పొదలకూరు: వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతు ద్రోహిగా మారారని.. ప్రజలకు ఇచ్చిన హామీల్లో దేన్నీ నెరవేర్చడంలేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పొదలకూరులోని పార్టీ మండల కన్వీనర్‌ పెదమల్లు రమణారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు కార్యక్రమాలను విజయవంతం చేశామని తెలిపారు. ఫలితాలు వెల్లడైన జూన్‌ నాలుగు నుంచి.. ప్రభుత్వం కొలువుదీరిన 12 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. వీటికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని, బోగస్‌ హామీలను నమ్మి తాము మోసపోయామనే వాస్తవాన్ని తెలుసుకున్నారని పేర్కొన్నారు. తిరుపతిలో సభను చంద్రబాబు నిర్వహించి ఆత్మస్తుతి.. పరనింద అనే చందాన రకరకాల మాటలను వల్లెవేశారని విమర్శించారు. ఆయన ప్రసంగమంతా తడబాటుతోనే సాగిందని, సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌ అంటూనే ఆడబిడ్డ నిధిని ఇవ్వలేకపోయానన్నారని పేర్కొన్నారు.

యాప్‌తో ఇబ్బందులు

యాప్‌ల పేరుతో యూరియాను ఇవ్వకుండా అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ పద్ధతితో కౌలు రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. యాప్‌లో వివరాలను వీరు నమోదు చేస్తే.. ఓటీపీ భూ యజమానికి వెళ్తోందని, ఆయన అమెరికాలో ఉంటే అక్కడ రాత్రి.. ఇక్కడ పగలని.. ఈ క్రమంలో వీటిని ఎప్పుడు చెప్పి యూరియాను తీసుకెళ్లాలని ప్రశ్నించారు. పట్టాదారు పాస్‌పుస్తకం, ఈ – క్రాప్‌, యాప్‌ నిబంధనలతో అర్హులైన కర్షకులు సైతం యూరియాను పొందే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి సందర్భాలు ఉన్నాయానని నిలదీశారు. నేతలు పెదమల్లు రమణారెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, లక్ష్మీకల్యాణి, వూకోటి లక్ష్మీనారాయణ, వాకాటి శ్రీనివాసులురెడ్డి, వెన్నపూస దయాకర్‌రెడ్డి, వెన్నపూస కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement