● వైఎస్సార్సీపీ ఫ్ల్లెక్సీల ధ్వంసం
కోవూరు: టీడీపీ నేతల అరాచకాలు, దాష్టీకాలు రోజురోజుకూ హద్దు మీరుతున్నాయి. ప్రజాపాలనను గాలికొదిలి.. సంక్షేమాన్ని అటకెక్కించారు. సూపర్ సిక్స్ వంటి పథకాలపై హామీలిచ్చి ప్రజలకు టీడీపీ వెన్నుపోటు పొడిచింది. ఈ క్రమంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోవూరులో శుక్రవారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలను ఆ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. దీనికి తగినట్లుగానే మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఊహించని విధంగా సూపర్ సక్సెస్ అయింది. నియోజకవర్గ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీన్ని తట్టుకోలేకపోయిన టీడీపీ పట్టణాధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, నేతలు అసహనానికి గురయ్యారు. కార్యక్రమం ముగిసిన కొద్ది సేపటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మల్లారెడ్డి సమక్షంలో పచ్చ పార్టీ నేతలు కొందరు మద్యం మత్తులో ధ్వంసం చేశారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రజలు తరలిరావడాన్ని స్థానిక నేతల మొదలుకొని టీడీపీ ఎమ్మెల్యే వరకు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను చూసినా తట్టుకోలేకపోతున్నారు. రాజకీయంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక, ఇలాంటి నీచపు పనులకు టీడీపీ నేతలు పాల్పడుతుంటే.. ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా భేదాభిప్రాయాలున్నా, పరస్పర గౌరవం పాటించాలని.. ఫ్లెక్సీలు చించడం, పోస్టర్లు తొలగించడం వంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచి పరిణామాలు కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హితవు పలికారు.


