మట్టి అక్రమ తరలింపుపై రామిరెడ్డి ఫైర్‌ | - | Sakshi
Sakshi News home page

మట్టి అక్రమ తరలింపుపై రామిరెడ్డి ఫైర్‌

Jun 14 2026 10:07 AM | Updated on Jun 14 2026 10:07 AM

స్వయంగా రంగంలోకి దిగి అడ్డుకున్న వైనం

కావలి: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి కావలి నియోజకవర్గంలో గ్రావెల్‌ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార అండతో టీడీపీ, కూటమి నేతలు చెలరేగిపోతూ రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములతో పాటు చెరువులు, వాగులు, వంకలను సైతం వీరు కొల్లగొడుతున్నారు. చెరువుల్లో ఏర్పడిన పెద్ద గుంతలు ప్రాణసంకటంగా మారాయి. పట్టణంలోని కావలి పెద్దచెరువు, మన్నంగిదిన్నె, చెన్నాయపాళెం, రుద్రకోట తదితర చెరువుల్లో పరిస్థితి ఘోరంగా మారింది. చెన్నాయపాళెం చెరువులో పగలూ రాత్రనే తేడా లేకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై స్థానికులు అడ్డుకోగా, వీరిపై దాడులకూ తెగబడ్డారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రెస్‌మీట్లను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పలుమార్లు నిర్వహించినా, వారి నుంచి కనీస స్పందన కరువైంది. గ్రావెల్‌ తరలింపును ఆపకపోతే తమ పార్టీ శ్రేణులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో చివరికి ఆయనే రంగంలోకి దిగారు. కొనదిన్నెలోని ఇరిగేషన్‌ భూమిలో మట్టిని తవ్వి లేఅవుట్లకు తరలిస్తుండటంతో స్వయంగా వెళ్లి అడ్డుకున్నారు. నియోజకవర్గంలో ఇక నుంచి ఇలాంటి వాటిని ఉపేక్షించేదిలేదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కనుసన్నల్లో కోట్లాది రూపాయల అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement