అనుమతులు గోరంత..
● ఊనుగుంటపాళెంలో
గ్రావెల్ అక్రమ తవ్వకాలు
● పేదల భూములే టార్గెట్‌గా
చెలరేగిపోతున్న అక్రమార్కులు
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో భారీగా గ్రావెల్ భూములు ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని కూటమి నేతలు తమ గుప్పిట్లోకి తీసుకుని మూడు జేసీబీలు, ఆరు టిప్పర్లు అనే రీతిగా అక్రమ వ్యాపారానికి తెరతీశారు. పేరుకు గుత్తేదారులు గోరంత అనుమతులు తీసుకొని కొండంత తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. కోట మండలం ఊనుగుంటపాళెం రెవెన్యూ పరిధిలోని పేదల భూములపై కన్నెసిన కూటమి నాయకులు అక్కడ సుమారు 30 నుంచి 40 అడుగుల గ్రావెల్‌ను మేర తవ్వి తరలించేస్తున్నారు.
చిల్లకూరు: సాగరమాల పేరుతో జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా రోడ్డు నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లకు గ్రావెల్ అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో సాగరమాల కాంట్రాక్టర్లే ఎక్కడైనా ఎత్తుగా ఉన్న భూములను చూసి వాటిని ఎత్తు తగ్గించేలా మూడు అడుగుల మేర తవ్వకాలు చేసే వారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత స్థానిక నాయకులు రంగంలోకి దిగి సాగరమాల కాంట్రాక్టర్లతో తామే గ్రావెల్ సప్లయ్ చేస్తామని స్థానిక ప్రజా ప్రతినిధి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో రహదారి నిర్మాణం జరిగే ఆయా మార్గాల్లో ఉన్న పేదల భూములపై కన్నేసి చదును పేరుతో కారు చౌకగా కొనుగోలు చేసి అందులో 30 అడుగుల మేర తవ్వకాలు చేసి మట్టి, గ్రావెల్ తరలించుకుపోతున్నారు. అలాగే అనధికార లేఅవుట్‌లకు మట్టి, గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో నిత్యం వందల టిప్పర్ల మట్టి, గ్రావెల్ తరలిపోతూ ఉంది. మార్గమధ్యలో ఏ అధికారైనా అడిగితే సాగరమాల రహదారి కాంట్రాక్టు సంస్థకు చెందిన వాహనాలని చెప్పి తప్పించుకుపోతున్నారు.
ఒక్కరూ చూడరు
కోట మండలం ఊనుగుంటపాళెంలోని పేదల భూముల నుంచి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలపై ఏ శాఖాధికారి కూడా కన్నెత్తి చూడరు. అనుమతుల్లేకుండా గ్రావెల్ తరలించుకు పోతున్నారని ఫిర్యాదులు అందించినా మనకు ఎందుకు అని మిన్నకుండిపోతున్నారు. కళ్ల ముందే ప్రభుత్వ భూమిలో మట్టి, గ్రావెల్ తవ్వేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది పట్టా భూమి, దాంతో మాకేమి పని అని రెవెన్యూ, గనుల శాఖాధికారులు తప్పించుకుంటున్నారు. ఇక నీటి పారుదల అధికారులు చెరువుల్లో మట్టి తవ్వకాలకు గోరంత అనుమతి ఇస్తే దానిని కొండంతగా తవ్వి తరలించేస్తుంటారు.
అడ్డుకుంటే బెదిరింపులు
రోజు మొత్తం గ్రావెల్ టిప్పర్లతో రాత్రి పూట నిద్ర పట్టడం లేదని గ్రామాల ప్రజలు టిప్పర్లను అడ్డుకుంటే వారిపై కూటమి నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనికి తోడు సాగరమాల రహదారి నిర్మాణ పనులకు గ్రామస్తులు అడ్డుపడుతున్నారని కాంట్రాక్టర్లతో కలిసి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని రెవెన్యూ, పోలీస్ అధికారులు రహదారి నిర్మాణ పనులను అడ్డుకుంటే అభివృద్ధి ఆగిపోతుందని, ఇలాగే కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీంతో గ్రామస్తులు తమ మీద ఎక్కడ కేసులు బనాయిస్తారోనని మిన్నికుండి పోతున్నారు.
ఊనుగుంటపాళెంలోని పేదల భూముల్లో తవ్వకాలు చేపడుతున్న భారీ యంత్రాలు
తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతల మధ్య వెళ్తున్న టిప్పర్


