వ
సారి
● జిల్లాలో వేలాది మంది రక్తదాతలు
● స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిద్దాం
● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
నెల్లూరు(అర్బన్): అన్ని దానాల్లో రక్తదానం గొప్పదంటారు. ఒక్క యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడగలదు. దీనివల్ల ఇతరుల ప్రాణాలు నిలపడమే కాకుండా దాతలకు కూడా అనేక ఆరోగ్య లాభాలున్నాయి. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు, రక్తహీనత ఉన్న వారికి, ఆపరేషన్ చేసే వారికి అవసరమైన రక్తం ఎవరైనా దానం చేస్తేనే ప్రాణాలు నిలబడుతాయి. ఈవిషయాన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ రక్త వర్గాలను కనుగొన్న కార్ల్ ల్యాండ్ స్టీనర్ జయంతిని పురస్కరించుకుని 2004 నుంచి అధికారికంగా ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. రక్తదానంపై అవగాహన కలిగిస్తోంది.
వేలాది మంది రక్తదాతలకు సలాం
జిల్లాలో వేలాది మంది రక్తదాతలుగా ఉన్నారు. ఆపద వచ్చినప్పుడు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. జిల్లాలో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు రోగుల అవసరాలను ఎక్కువగా తీరుస్తోంది. కావలిలో కూడా రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు బ్రాంచ్ ఉంది. తర్వాత నోవా బ్లడ్ బ్యాంకు రోగులకు రక్తం అందిండంలో ఆదర్శంగా నిలుస్తోంది. నెల్లూరు సర్వజన ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకు ఉన్నా అది రోగుల అవసరాలు తీర్చడంలో విఫలమైంది. రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకు ప్రతి సంవత్సరం 16 వేల నుంచి 17 వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తోంది. అయితే ఈ సంవత్సరం వేసవిలో రక్తకొరత తీర్చడంలో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు కొంత వెనకబాటు పట్టింది. ఇందుకు పాలకవర్గం సరిగా పట్టించుకోకపోవడం ఒక కారణం. గత నెలలో పాలకవర్గ పదవీకాలం తీరిపోవడంతో ఎన్నికలు జరగలేదు. కొత్త పాలకవర్గం లేకపోవడంతో కూడా రక్తకొరతకు మరొక కారణంగా చెప్పవచ్చు.
రక్తదానంతో ఎన్నో ప్రయోజనాలు
రక్తదానంతో గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఐరన్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. కొత్త రక్తకణాలు ఉత్పత్తయ్యేందుకు రక్తదానం ఎంతో అవసరం. 18 ఏళ్లు నిండి 65 ఏళ్లలో ఉన్న ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ రక్తదానం చేయవచ్చు. ఒక్కరు ఒక్క యూనిట్ రక్తం దానం చేస్తే దానిని మూడు రకాల కాంపొనెంట్లుగా విభజిస్తారు. అలా ముగ్గురు రోగులకు ఇచ్చి ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. అందువల్ల యువత రక్తదానానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
నేడు అవగాహన కార్యక్రమాలు
స్వచ్ఛంద రక్తదానంపై జిల్లాలో పెద్ద ఎత్తున ఆదివారం అవగాహన కార్యక్రమాలు జరగబోతున్నాయి. రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంకులో ఎక్కువ దఫాలు రక్తదానం చేసిన వారిని సన్మానించబోతున్నారు. వైద్యశాఖ, ఇతర అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ ఫొటోలోని వ్యక్తి చంద్రగిరి అజయ్‌బాబు. రెడ్‌క్రాస్‌లో జీవిత కాల సభ్యుడిగా ఉన్నాడు. బ్లడ్‌బ్యాంకు మాజీ కన్వీనర్. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. పాఠశాల సమయం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లకుండా బ్లడ్‌బ్యాంకు కార్యక్రమాల్లో పాల్గొనే వారు. పాఠాలు ఎంత చిత్తశుద్ధితో చెబుతాడో సామాజిక సేవలో అంతే నిబద్ధతతో పని చేస్తారు. ఇప్పటికే 119 సార్లు రక్తదానం చేశారు. ఆదివారం 120వ దఫా రక్తదానం చేయబోతున్నట్టు తెలిపారు. ఈయన తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచాడు.


