మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి పోలీసుల నోటీసులు | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి పోలీసుల నోటీసులు

Jun 13 2026 1:17 PM | Updated on Jun 13 2026 1:17 PM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు. ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో చేసిన రాజకీయ విమర్శల నేపథ్యంలో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కావలి ఒకటో పట్టణ ఎస్సై సుమన్‌ నోటీసులు జారీ చేశారు. సోషల్‌ మీడి యాలో విపరీతంగా మాట్లాడలేని భాషలో తమను, తమ నేతలపై అభ్యంతరకరమైన రీతిలో పోస్టులు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తే ఆ కేసులు మాత్రం కట్టకుండా రెడ్‌బుక్‌ రాజ్యాంగం లో భాగంగా మా మీద కేసులు కట్టి వేధింపులకు గురి చేస్తున్నారంటూ ప్రతాప్‌కుమార్‌రెడ్డి నోటీసులు అందజేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో అందరికీ తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

గ్రామాలు అభివృద్ధి

చెందేలా ప్రణాళికలు

నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పనుల ప్రణాళికలను సిద్ధం చేయాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ (జీపీడీపీ)పై జెడ్పీ సమావేశ మందిరంలో మండలాధికారులకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిధులకు అనుగుణంగా పనుల ప్రణాళికలను రూపొందించాలని కోరారు. గ్రామసభలను నిర్వహించి ప్రజలను ఆహ్వానించాలని సూచించారు. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత తదితర అంశాలకు సంబంధించిన పనులను గుర్తించాలన్నారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా సభలను నిర్వహించి ప్రణాళికలను రూపొందించాలని పేర్కొన్నారు.

గిరిజన మార్కెటింగ్‌ సొసైటీకి

ఐదుగురు డైరెక్టర్ల ఎన్నిక

నెల్లూరు(వేదాయపాళెం): నగరంలోని కొండాయపాళెం గేట్‌ సమీపంలో గల ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్‌ సొసైటీ డైరెక్టర్ల ఎన్నికలను శుక్రవారం నిర్వహించారు. ప్రక్రియను జిల్లా కో ఆపరేటివ్‌ ఆఫీసర్‌ కోటేశ్వరరావు జరిపారు. ఐదు డైరెక్టర్‌ స్థానాలకు ఐదుగురే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం వీరికి పత్రాలను అందజేశారు. పెంచలయ్య, కత్తి ఆదిశేషయ్య, పెంచలయ్య, భూపతి జయరామయ్య, మోపూరు అడివయ్యను యానాదుల సంక్షేమ సంఘ నేతలు సత్కరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement