రెండేళ్లుగా మోసం.. రోడ్డెక్కిన ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా మోసం.. రోడ్డెక్కిన ఆగ్రహం

Jun 13 2026 1:17 PM | Updated on Jun 13 2026 1:17 PM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్ల పాలనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులతోపాటు వేలాదిగా ప్రజలు కదిలొచ్చి.. కదం తొక్కారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు నిప్పులు చెరిగిన మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన జనం కూటమి సర్కారు రెండేళ్ల నిరంకుశ పాలనపై ప్ల్లకార్డులు పట్టుకుని నిరసన గళాలతో గర్జించారు. బైక్‌ ర్యాలీలతో హోరెత్తించారు. మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిది నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలతో కలిసి బూటకపు హామీలు, బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌ గ్యారెంటీ పత్రాలను, మేనిఫెస్టోలను దహనం చేశారు. సూపర్‌ సిక్స్‌ హామీలు, బాబు ష్యూరిటీ, భవిష్యత్‌ గ్యారెంటీతో రెండేళ్లుగా అన్ని వర్గాలను వంచనకు గురి చేయడంపై నిరసనల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి, రాజకీయ కక్షలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ప్రతిపక్షం అణచివేతపై సాగించిన అరాచక పాలనపై నిప్పులు చెరిగారు. ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో రోడ్లపైకి రావడంతో రెండేళ్లలోనే ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి అద్దం పట్టింది. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ, సూపర్‌ సిక్స్‌ కాదు.. సూపర్‌ మోసం, రెడ్‌బుక్‌ పాలన.. ప్రజలకు నరకయాతన, టీడీపీ బాండ్లు.. ప్రజలను మభ్యపెట్టిన హామీలు, రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలోకి వెళ్లిపోయిందనే విధంగా ఏపీ మ్యాప్‌ చిత్రంతో కన్నీరు పెట్టుకుంటున్నట్లు వినూత్న నిరసనలు ప్రజలను ఆలోచింపజేశాయి. సాయంత్రం ఆత్మకూరు, కోవూరుల్లో జరిగిన నిరసనల్లో ఉరుములు, మెరుపులు, భారీ వర్షంలో సైతం ప్రజాగ్రహం పెల్లుబికింది. వైఎస్సార్‌సీపీ ర్యాలీలను కట్టడి చేసేందుకు పోలీసులు కొన్ని చోట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. కావలిలో బ్రిడ్జి సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నిరసనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గూడూరులో ర్యాలీలకు అనుమతి లేదంటూ ముందస్తు నోటీసులు ఇచ్చారు.

సూపర్‌ సిక్స్‌ హామీలు, బాబు ష్యూరిటీ, భవిష్యత్‌ గ్యారెంటీ, మేనిఫెస్టో దహనం

వివిధ హామీలు, దగాలపై

ఫ్లకార్డులతో వినూత్న ప్రదర్శన

మండుటెండను సైతం.. ఉరుముల వర్షాన్నీ లెక్క చేయని వైనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement