విద్యార్థులకు సమస్యల స్వాగతం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సమస్యల స్వాగతం

Jun 13 2026 1:17 PM | Updated on Jun 13 2026 1:17 PM

నెల్లూరు(టౌన్‌): వేసవి సెలవుల అనంతరం శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. మొండిగోడలు, అపరిశుభ్ర వాతావరణంలో టాయ్‌లెట్లు దర్శనమిచ్చాయి. చాలాచోట్ల ఆర్వో ప్లాంట్లు పనిచేయకపోవడంతో ఇంటి నుంచి తెచ్చుకున్న వాటర్‌ బాటిళ్లే వారికి దిక్కయ్యాయి. తొలిరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లు ఇస్తారని ఆశించిన విద్యార్థులకు ఆశాభంగం కలిగింది. జిల్లాలోని మెజార్టీ పాఠశాలల్లో పుస్తకాలు తప్ప ఇతర వస్తువులు అందజేయలేదు. ‘మన బడి – మన పండగ’ కార్యక్రమం మొక్కుబడిగా సాగిందనే విమర్శలు ఉన్నాయి. ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఉపాధ్యాయులు సైతం ఆసక్తి చూపలేదని తెలిసింది.

సగం మంది విద్యార్థులే హాజరు

పాఠశాలల పునఃప్రారంభం రోజు సగం మంది విద్యార్థులే హాజరయ్యారు. మంచిరోజు చూసి పంపాలని తల్లిదండ్రులు భావించడంతో ప్రైవేట్‌ స్కూళ్లకు సైతం తక్కువ సంఖ్యలో వచ్చారు. జిల్లాలో 3,225 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 1,62,262 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,48,291 మంది గైర్హాజరయ్యారు. ఉపాధ్యాయుల్లో 10,511 మందికి 10,334 మంది హాజరైనట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఏ తరగతి విద్యార్థులకు కూడా పాఠాలు బోధించని పరిస్థితి నెలకొంది.

దృష్టి పెట్టలేదు

పాఠశాలలు పునఃప్రారంభించిన రోజే విద్యార్థులకు కిట్లు ఇవ్వాల్సి ఉన్నా విద్యాశాఖాధికారులు పట్టించుకోలేదు. కొద్దిమందికి మాత్రమే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. యూనిఫాం, బ్యాగ్‌లు, బెల్టులు, బూట్లు, సాక్స్‌లు ఇంకా అందించలేదు. మధ్యాహ్న భోజనం కూడా నాణ్యంగా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు.

పాత కిట్లతోనే..

కొంతమంది విద్యార్థులు చినిగిపోయిన బ్యాగ్‌లతో రాగా, మరికొందరు సొంత వాటిలో పుస్తకాలు తెచ్చుకున్నారు. ఎక్కువ మందిచెప్పులతోనే పాఠశాలలకు వచ్చారు. యూనిఫాం లేకుండానే హాజరైన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. పాఠశాలల్లో వసతులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.

అపరిశుభ్రంగా మరుగుదొడ్లు,

తొలిరోజు సగం మందికి పైగా

హాజరుకాని బాలబాలికలు

పుస్తకాలతో సరిపెట్టిన

విద్యాశాఖ అధికారులు

యూనిఫాం, బూట్లు, బ్యాగ్‌లు ఇవ్వని వైనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement