ఏఆర్‌ ఏఎస్పీ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఏఆర్‌ ఏఎస్పీ బాధ్యతల స్వీకరణ

Jun 13 2026 1:17 PM | Updated on Jun 13 2026 1:17 PM

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరు ఏఆర్‌ ఏఎస్పీగా పీవీ అప్పారావు శుక్రవారం స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అప్పారావు ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్యను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఆయన గతంలో అక్టోపస్‌ విభాగం, విజయనగరం జిల్లా పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో విధులు నిర్వహించారు.

రైల్వేస్టేషన్‌లో జీఎం తనిఖీలు

నెల్లూరు సిటీ: నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను విశాఖ జోన్‌ జీఎం సందీప్‌ మాధూర్‌ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

బాలిక బలవన్మరణం

● కోరుకున్న కళాశాలలో చేర్పించలేదని..

నెల్లూరు (క్రైమ్‌): తాను కోరుకున్న కళాశాలలో చేర్పించలేదన్న మనస్తాపంతో ఓ బాలిక ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని జ్యోతినగర్‌లో శేషగిరిరావు కుటుంబం నివాసం ఉంటోంది. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె లావణ్య (17) ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఎంసెట్‌ రాసింది. స్నేహితులు విజయవాడలోని ఓ ప్రైవేట్‌ యూనివర్సిటీలో బీటెక్‌ చేరుతున్నారని, అక్కడే తనను చేర్పించాలని ఆమె పలుమార్లు తండ్రిని అడిగింది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంత పెద్ద కళాశాలలో చేర్చలేనని అతను సర్దిచెబుతూ వచ్చాడు. దీంతో ఆమె కొద్ది రోజులుగా ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉంటోంది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. కుమార్తెకు టిఫిన్‌ తీసుకుని శేషగిరిరావు ఇంటికి వచ్చాడు. తలుపులు లోపల గడియ పెట్టి ఉండటంతో అనుమానంతో కిటికీలో నుంచి చూడగా కుమార్తె ఉరేసుకుని కనిపించింది. బంధువుల సాయంతో తలుపులు తెరిచి కుమార్తెను కిందికి దించి చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. వేదాయపాళెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement