● ఓ వ్యక్తికి తీవ్రగాయాలు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు మినీబైపాస్‌లో కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నార్త్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం యలమవారిదిన్నెకు చెందిన ధనుష్ కుమార్ ఈవెంట్స్‌లో డ్రోన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతను గురువారం మాగుంట లే అవుట్‌లోని హెచ్‌ఎన్‌ఆర్ కల్యాణ మండపంలో ప్రోగ్రామ్‌కు వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున డేటా కాపీ చేసుకునేందుకు బాలాజీ నగర్‌లోని రూమ్‌కు మోటార్‌బైక్‌పై బయలుదేరాడు. పూలే బొమ్మ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద యూటర్ను తీసుకుంటున్నాడు. ఆత్మకూరు బస్టాండ్ వైపు నుంచి రామలింగాపురం వైపు వెళ్తున్న కారు మీతిమీరిన వేగంతో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ధనుష్ రోడ్డుపై పడ్డాడు. కారు వేగనియంత్రణ కాక రోడ్డు మార్జిన్‌లో ఉన్న ట్రక్కు ఆటో, గూడ్సు ఆటో, వెల్డింగ్‌షాపు ముందున్న ఇనుపగేట్లను ఢీకొంది. తర్వాత సిమెంట్ కరెంట్ పోల్‌ను ఢీకొంది. అందులో ఉన్న ఇద్దరు యువకులు పరారయ్యారు. ధనుష్‌ను కుటుంబ సభ్యులు తిరుపతిలోని బర్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్‌ల్లో చేర్పించారు. బాధిత కుటుంబం నార్త్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై ఎ.సైదులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి మితిమీరిన వేగమా?, మద్యం మత్తా? అనేది కారణం తెలియరావాల్సి ఉంది. ప్రమాదం వల్ల కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి. అందులో ఉన్న వ్యక్తులు ఎవరనే విషయంపై ఎస్సై ఆరా తీస్తున్నారు.


