నెల్లూరు(క్రైమ్): పోలీసుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యమని ఏఎస్పీ సీహెచ్ సౌజన్య అన్నారు. నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థల కరస్పాండెంట్లు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పదోతరగతి ఉత్తీర్ణులైన పోలీసు సిబ్బంది పిల్లలకు కౌన్సెలింగ్ నిర్వహించి 65 మందికి ఉచితంగా, 40 మందికి 50 శాతం రాయితీపై కార్పొరేట్ కళాశాలల్లో సీట్లు కేటాయించారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ పీవీ అప్పారావు, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, ఏఓ చంద్రమౌళి, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
కత్తులతో బెదిరించి.. ● బంగారు గొలుసు దోపిడీ
నెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని ఇందిరమ్మకాలనీ వద్ద గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వార్డు సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ బంగారు గొలుసును దోపిడీ చేశారు. పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలం మండలంలోని అనికేపల్లి సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీగా సురేంద్ర పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి విధులు పూర్తిచేసుకుని నెల్లూరులోని తన ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇందిరమ్మ కాలనీ వద్ద ముగ్గురు యువకులు స్కూటీపై వచ్చి సురేంద్ర బైక్‌ను అడ్డగించారు. కత్తులతో బెదిరించి అతని మెడలోని రెండు సవర్లు బంగారు గొలుసు దోపిడీ చేశారు. బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్ ఇన్‌స్పెక్టర్ వేణు కేసు నమోదు చేశారు.


