పెన్నానదిలో కాసుల వేట | - | Sakshi
Sakshi News home page

పెన్నానదిలో కాసుల వేట

Jun 11 2026 12:07 AM | Updated on Jun 11 2026 12:07 AM

కోవూరు: నియోజకవర్గ పరిధిలోని పెన్నా నది నుంచి ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడ, కోవూరు మండలంలోని జమ్మిపాళెం, వేగూరు, ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు, ముదివర్తిపాళెం, విడవలూరు మండలంలోని ముదివర్తి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు. ఒక్కో ప్రాంతం నుంచి రోజూ సుమారు 50 నుంచి వందలోపు ట్రాక్టర్లలో తరలిస్తున్నట్లు తెలిసింది.

రాత్రి వేళల్లో..

నది పరీవాహక ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. నది అడుగు భాగాన్ని లోతుగా తవ్వి ఇసుకను ట్రాక్టర్లు, టిప్పర్లలో నింపి తరలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి వేళల్లో కూడా ఇసుక రవాణా జరుగుతున్నా సంబంధిత శాఖలు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. నదిలో భారీ గుంతలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో మరోలా..

ఇసుక తవ్వకాలకు అనుమతి లేవని రెవెన్యూ, మైనింగ్‌, పోలీస్‌ శాఖల అధికారులు ప్రకటించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులున్నాయి. అనుమతి లేకపోతే నదిలో తిరుగుతున్న ట్రాక్టర్లు, టిప్పర్లు ఎవరివి?, రోజూ వందల ట్రిప్పుల ఇసుక ఎలా తరలుతోందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్దఎత్తున కార్యకలాపాలు జరుగుతున్నా అధికారులకు తెలియకపోవడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అక్రమంగా తరలిస్తున్న ఇసుక విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా. అక్రమ రవాణా ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా పెన్నా పరీవాహక ప్రాంతమంతా విస్తరించిందని విమర్శలు ఉన్నాయి.

రాజకీయ అండతో..

ఇసుక మాఫియా ఇంత ధైర్యంగా వ్యవహరించడానికి రాజకీయ అండదండలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగుతోందని విమర్శిస్తున్నాయి. ఫిర్యాదులు చేసినా చర్యలు కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ ఆరోపణలపై జిల్లా యంత్రాంగం స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నదిలో విచక్షణారహితంగా ఇసుక తవ్వకాలు జరగడంతో భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో నీటి సమస్యలున్నాయని, ఇసుక తవ్వకాలు కొనసాగితే భవిష్యత్‌లో తాగు, సాగునీటి సమస్యలు మరింత తీవ్రం అవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెన్నా నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. ఇదీ అధికారులు చెప్పే మాట. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. అసలు నదీ గర్భంలో భారీ యంత్రాలు పనిచేస్తూ ఇసుకను వెలికితీస్తున్నాయి. ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుక తరలింపు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసం కోవూరు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

రాత్రింబవళ్లు సాగుతున్న

అక్రమ తవ్వకాలు

అనుమతి లేదంటున్న యంత్రాంగం

మరి నదిలో తిరుగుతున్న వాహనాలు

ఎవరివో?

సహజ స్వరూపానికి ముప్పు

అక్రమ తవ్వకాలతో పెన్నా నది సహజ ప్రవాహ వ్యవస్థ దెబ్బతింటోందని స్థానికులు చెబుతున్నారు. నది అడుగు భాగంలో భారీ గుంతలు ఏర్పడటంతో వరదల సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదిని పరిరక్షించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. జొన్నవాడ, జమ్మిపాళెం, వేగూరు, పల్లిపాడు, ముదివర్తిపాళెం, ముదివర్తి ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు, ఈ వ్యవహారం వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement