ప్రభుత్వంపై సమరానికి ఉద్యోగులు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై సమరానికి ఉద్యోగులు సిద్ధం

Jun 11 2026 12:07 AM | Updated on Jun 11 2026 12:07 AM

నెల్లూరు(అర్బన్‌): ‘కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఉద్యోగ, ఉపాధ్యాయ, అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్స్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దీంతో ప్రభుత్వంపై సమరానికి సిద్ధంగా ఉండాలి’ ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్‌ ఆవరణలోని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యాలయంలో ఏపీ జేఏసీ అమరావతి నాయకుల అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచలరెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించకపోవడం సిగ్గు చేటన్నారు. ఆకాశాన్నింటిన ధరలు, ఆర్థిక సంక్షోభంతో అనేక చిరుద్యోగ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడం అన్యాయమన్నారు. కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌, ఆర్టీసీ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను గాలికొదిలేసిందన్నారు. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి, తక్షణమే ఐఆర్‌ను ప్రకటించాలన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ను పునరుద్ధరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న రెండు సంవత్సరాల చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు అమలు చేయాలన్నారు. సరెండర్‌ లీవులు ఎప్పటికప్పుడు చెల్లించాలని కోరారు. ఆర్టీసీ, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకుంటే తమ సంఘం రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరంతర ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కార్యదర్శి ఓవీ ప్రసాద్‌, కో చైర్మన్‌ మునీంద్ర, మహిళా విభాగం కన్వీనర్‌ సోమిశెట్టి వసంతకుమార్‌, చైతన్య కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

పీఆర్సీ లేదు.. డీఏ అరియర్స్‌

ఇవ్వడం లేదు

కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తీరని అన్యాయం

ఏపీ జేఏసీ అమరావతి నేతలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement