చికిత్స పొందుతూ వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Jun 11 2026 12:07 AM | Updated on Jun 11 2026 12:07 AM

నెల్లూరు సిటీ: భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెంది పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కార్తీక్‌ (40) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి చనిపోయాడు. బుధవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. కొత్తూరులో కార్తీక్‌, జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. కార్తీక్‌ అప్పులపాలు కావడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో జ్యోతి తాగొద్దని ఎంత చెప్పినా భర్త వినలేదు. భార్య ఇటీవల సౌత్‌మోపూరులోని తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం కార్తీక్‌.. ఆమె ఇంటి వద్దకు వెళ్లి తనతో రావాలని అడిగాడు. జ్యోతి రానని చెప్పడంతో పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని తిరుపతిలోని రుయా హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

అందుబాటులోకి

టోల్‌ఫ్రీ నంబర్‌

నెల్లూరు(అర్బన్‌): లింగ నిర్ధారణ తదితరాలను అరికట్టే పీసీ పీఎన్‌డీటీ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే తెలియపరిచేందుకు టోల్‌ఫ్రీ 1800 233 2447 నంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినట్లు డీఎంహెచ్‌ఓ సుజాత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆడశిశువుల హక్కుల పరిరక్షణ, లింగ వివక్ష నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పీసీ పీఎన్‌డీటీ చట్టాన్ని విజయవంతంగా అమలు చేయగలమన్నారు. అందువల్ల గర్భస్త శిశువు లింగ నిర్ధారణకు సంబంధించి అక్రమ కార్యకలాపాలు, లింగ నిర్ధారణ సేవల ప్రకటనలు, అనుమతి లేని స్కానింగ్‌, డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు, లింగ ఎంపికను ప్రోత్సహించే ఏ విధమైన చర్యలనైనా గుర్తించి ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్‌ చేయాలని కోరారు. ఆడపిల్లను కాపాడుకునేందుకు, సమానత్వ సమాజాన్ని నిర్మించేందుకు ప్రజలు ఈ చట్టం ద్వారా భాగస్వామ్యులు కావాలని కోరారు.

వేణుగోపాల్‌ నగర్‌లో కార్డెన్‌ సెర్చ్‌

నెల్లూరు(క్రైమ్‌): నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి బుధవారం వేణుగోపాల్‌ నగర్‌లో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సరైన పత్రాల్లేని 11 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇన్‌స్పెక్టర్‌ రహదారి భద్రతా నియమాలు, శక్తి యాప్‌, ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సేవలు, సైబర్‌ నేరాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి విక్రయాలను గుర్తిస్తే డయల్‌ 112 లేదా పోలీసుస్టేషన్‌కు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో నవాబుపేట పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement