రక్త పరీక్షల కేంద్రంలో సిబ్బంది రుబాబు | - | Sakshi
Sakshi News home page

రక్త పరీక్షల కేంద్రంలో సిబ్బంది రుబాబు

Jun 11 2026 12:07 AM | Updated on Jun 11 2026 12:07 AM

ఇబ్బందులు పడుతున్న గర్భిణులు,

ఆశా కార్యకర్తలు

ఖాళీ కుర్చీలు ఉన్నా కూర్చోనివ్వలేదని ఆరోపణలు

ఆత్మకూరు: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రక్త పరీక్షల కేంద్రం వద్ద సిబ్బంది తీరుపై గర్భిణులు, ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల కోసం వచ్చిన వారితో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తీవ్ర స్వరంతో మాట్లాడుతున్నారనే ఆరోణలున్నాయి. ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెలా గర్భిణులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా 9, 10 తేదీల్లో ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని గ్రామాల నుంచి గర్భిణులను ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. ఇక్కడ రక్తపరీక్షలు నిర్వహిస్తుంటారు.

పంపేశారు

బుధవారం పదిమందికి పైగా ఆశా కార్యకర్తలు తమ గ్రామాలకు చెందిన గర్భిణులను పరీక్షల కోసం తీసుకొచ్చారు. రక్త నమూనాలు తీసుకున్న అనంతరం రిపోర్టులు వచ్చిన తర్వాత రావాలని చెబుతూ గర్భిణులు, ఆశా కార్యకర్తలను అక్కడి నుంచి పంపేశారు. కుర్చీలు ఖాళీగా ఉన్నప్పటికీ కూర్చోనివ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపీ సమీపంలోని కుర్చీల్లో రోగులు కూర్చుని ఉండటంతో ఖాళీ లేక గర్భిణులు, ఆశా కార్యకర్తలు ఆస్పత్రి వరండాలో నేలపై కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రక్త పరీక్షల కేంద్రంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిని తరచూ తీవ్ర స్వరంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై రక్త పరీక్షల కేంద్రం డాక్టర్‌ స్పందిస్తూ భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూస్తామని తెలిపారు. రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయేమో పరిశీలిస్తామని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement