● స్వస్థలాలకు చేరిన
మృతదేహాలు
● చికిత్స పొందుతూ
మరో మహిళ మృతి
సంగం: బిహార్ రాష్ట్రంలోని బుద్ధగయా వద్ద జరిగిన టూరిస్టు బస్సు ప్రమాదంలో గాయపడిన బొమ్మిశెట్టి లక్ష్మమ్మ (52) బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. స్థానికుల కథనం మేరకు.. సంగంకు చెందిన లక్ష్మమ్మ, ఆమె భర్త వెంకటేశ్వర్లు కాశీ యాత్రకు బయలుదేరిన టూరిస్టు బస్సులో ఉన్నారు. ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడటంతో మగధ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వెంకటేశ్వర్లును చూసుకునేందుకు కుమారుడు శ్రీను వెళ్లాడు. కాగా లక్ష్మమ్మ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని, చికిత్స పొందుతూ కోలుకుంటున్న వెంకటేశ్వర్లును కుమారుడు అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకొస్తున్నాడు.
● పసుపులేటి వెంకటేశ్వర్లు, చవడం హజరత్తయ్య మృతదేహాలను బుధవారం ఇన్‌చార్జి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, ఎస్సై భోజ్యానాయక్, రెవెన్యూ సిబ్బంది తీసుకొచ్చారు. వెంకటేశ్వర్లు నివాసం నెల్లూరులో ఉండటంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అక్కడే అప్పగించారు. హజరత్తయ్యను విగతజీవిగా చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య గోవిందమ్మ, కుమార్తె, కుమారుడు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.
మిన్నంటిన రోదనలు
ఆత్మకూరు: ప్రమాదంలో చనిపోయిన సోమా పద్మావతి మృతదేహాన్ని బుధవారం ఆత్మకూరు పట్టణంలోని వీవర్స్ కాలనీకి తీసుకొచ్చారు. పద్మావతికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. భర్త ప్రసాద్ ఓ ప్రైవేట్ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. వీరిది పేద కుటుంబం. పిల్లలను చదివించుకుంటున్నాడు. బంధువులు, స్నేహితులు కాశీ యాత్రకు వెళ్తున్నాం.. రమ్మనడంతో వెళ్లిన ఆమె ప్రమాదంలో చనిపోయింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగానే పిల్లలు, సమీప బంధువులు రోదనలు మిన్నంటాయి. తాను చిన్న ఉద్యోగం చేస్తున్నా.. భార్య సంసారాన్ని ఎలాగోలా నెట్టుకొస్తోందని భర్త ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.
● కాగా తొలుత పద్మావతి మృతదేహాన్ని సంగంలో దించారు. ఆత్మకూరుకు హజరత్తయ్య మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు గుర్తించడంతో అధికారులు తేరుకుని మృతదేహాలను అదే వాహనంలో వారి ఇళ్లకు తరలించారు.


