● డీఆర్సీ సమావేశంలో ఇదీ పరిస్థితి
● వివిధ అంశాలను లేవనెత్తిన
ప్రజాప్రతినిధులు
● రెండున్నర గంటల్లో మీటింగ్ పూర్తి
నెల్లూరు(పొగతోట): జిల్లాలో పొగాకు సాగు చేస్తున్న రైతులు ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో డీఆర్సీ మీట్‌ను జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఫరూక్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. దీనికి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు. గంటకుపైగా ఆలస్యంగా ప్రారంభమైన మీటింగ్‌ను మధ్యాహ్నం 1.30కు ముగించారు. వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, జాతీయ రహదారులు తదితర శాఖలతో సమీక్షించి మమ అనిపించారు. యూరియా అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేలు తెలియజేశారు. ఎకరాకు ఐదు బస్తాల యూరియాను వినియోగించే అన్నదాతలకు మూడు బస్తాలను సైతం ఇవ్వకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారని వివరించారు. మూడు బస్తాల మేరే సరఫరా చేసేందుకు సర్కార్ చర్యలు చేపట్టిందని మంత్రులు బదులిచ్చారు.
పనులను త్వరగా ప్రారంభించాలి
చింతారెడ్డిపాళెం అండర్ పాస్ పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ కోరారు. పాఠశాలల్లో పనులనూ పూర్తి చేయాలని చెప్పారు. ఇక్కడ పరిశుభ్రత అధ్వానంగా మారిందన్నారు. మత్స్యకారులకు బోట్లను అందజేయాలని పేర్కొన్నారు. పొగాకు బోర్డులో జిల్లాకు సంబంఽధించిన రైతు సంఘాల నేతలు, ప్రజాప్రతినిధుల సభ్యత్వం ఉండేలా డీఆర్సీలో తీర్మానం చేశామని ఇన్‌చార్జి మంత్రి తెలిపారు. జొన్న పంటకు ప్రభుత్వ మద్దతు ధర అధికంగా ఉందని.. ఎమ్మెస్సెమ్‌ఈలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆదేశించారు.
తక్కువకు కొనుగోలు చేస్తున్నారు..
డీసీపల్లి పొగాకు బోర్డులో కిలో ప్రారంభ ధరను రూ.280గా నమోదు చేశారని, అయితే పెద్ద కంపెనీల్లేకపోవడంతో రూ.180 నుంచి రూ.185కే కొనుగోలు చేస్తున్నారని మంత్రి ఆనం తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది గ్రేడ్ – 1 రకం పొగాకును సాగు చేశారని, నాణ్యతగా ఉన్నా, ధరలను నీరుగారుస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. పశువుల కోసం 2500 ఎకరాల్లో చింతలదేవి బ్రీడింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ఇక్కడ బ్రీడింగ్ అద్భుతంగా ఉందని పశుసంవర్థక శాఖ అధికారులు చెప్తున్నా, అది వాస్తవం కాదని చెప్పారు. అసలు నీటి వసతి పూర్తి స్థాయిలో లేకపోతే ఇవన్నీ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
ఎవరెవరు ఏమి మాట్లాడారంటే..?
● ఆక్వా రంగానికి సంబంధించిన రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందడంలేదని ఎంపీ బీద మస్తాన్‌రావు తెలిపారు.
● పరిశ్రమలను పెట్టకుండా భూములను ఏ విధంగా కేటాయించారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎకరా రూ.లక్షకు వందెకరాలను కేటాయించాలని కోరారు.
● లష్కర్లకు వేతనాలివ్వాలని కోరుతున్నా, నేటికీ సమస్య పరిష్కారం కాలేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు.
● మత్స్యకారుల సేవ అందరికీ జమకాలేదని, దీనిపై సాంకేతిక కారణాలంటున్నారని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలియజేశారు. గూడూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలు పాశం సునీల్, కురుగొండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


