భారీ కుంభకోణం వెలుగులోకి | - | Sakshi
Sakshi News home page

భారీ కుంభకోణం వెలుగులోకి

Jun 11 2026 12:07 AM | Updated on Jun 11 2026 12:07 AM

అల్లూరు: జిల్లాలో అమాయక మహిళల అజ్ఞానం.. ప్రభుత్వ కార్యాలయాల రికార్డులను ఆసరాగా చేసుకొని సాగుతున్న ఒక భారీ బ్యాంక్‌ లోన్‌ కుంభకోణం వెలుగుచూసింది. బాధితురాలికి తెలియకుండానే ఆమె ఆధార్‌, రేషన్‌ కార్డులను దొంగలించి, సంతకాలను ఫోర్జరీ చేసి రూ. 20 లక్షల మేర బ్యాంక్‌ నిధులను కొల్లగొట్టిన వ్యవస్థీకృత ఆర్థిక నేరం స్థానికంగా తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తోంది.

అసలేం జరిగిందంటే..?

అల్లూరు మండలం, బట్రకాగొళ్లుకు చెందిన విమలకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బృందావనం బ్రాంచ్‌ నుంచి రికవరీ నోటీస్‌ ఇటీవల రావడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తానెప్పుడూ వెళ్లని బ్యాంక్‌లో, తనకు సంబంధం లేని కొండ్లపూడికి చెందిన స్వాతి పొదుపు లక్ష్మి గ్రూప్‌ పేరిట రూ. 20 లక్షల లోన్‌ (అకౌంట్‌ నంబర్‌ 0384 15090000018) మంజూరైందని.. ఇందులో తనకు రూ.రెండు లక్షలు ఇచ్చారని తెలుసుకొని నిర్ఘాంతపోయారు.

వెలుగు ఆఫీస్‌ డేటా చోరీ

బాధితురాలు విమల, కుటుంబసభ్యులు బ్యాంక్‌కు వెళ్లి రికార్డులను పరిశీలించగా, విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అల్లూరు పొదుపు సంఘం వెలుగు ఆఫీస్‌లో భద్రంగా ఉండాల్సిన ఆమె ఆధార్‌, రేషన్‌ కార్డుల రికార్డులను స్వాతి పొదుపు లక్ష్మి గ్రూప్‌, కొండ్లపూడి, నెల్లూరు రూరల్‌ మండలానికి చెందిన నిందితులు అక్రమంగా దొంగలించారు. సదరు గ్రూప్‌ ప్రెసిడెంట్‌ కీర్తి సునీత, వైస్‌ ప్రెసిడెంట్‌ పోలా వైష్ణవి మరికొందరితో కలిసి ఈ కుట్రకు తెరలేపారు. తన రికార్డులు ఎలా వచ్చాయని విమల ప్రశ్నించగా, అల్లూరు వెలుగు ఆఫీస్‌ నుంచి సేకరించామని తెలిపారు.

అధికారుల అండదండలతోనే..?

ఈ కుంభకోణంలో నిందితులు వాడిన పద్ధతి చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. లోన్‌ అప్లికేషన్‌ ఫైల్‌లో ఉన్న గ్రూప్‌ ఫోటో, పాస్‌ ఫొటోల్లో నిందితుల ముఖాలు క్లియర్‌గా ఉన్నాయి. అయితే ఆ ఫొటోల కింద ఉన్న పేర్లు, ఆధార్‌ నంబర్లు మాత్రం బాధితురాలు విమలవి కావడం గమనార్హం. అంటే బ్యాంక్‌కు వెళ్లిన నిందితులు తమ ఫొటోలు ఉంచుకొని, ఐడెంటిటీ కార్డులను మాత్రం అమాయక ప్రజలవి జతపర్చారు. ఆర్బీఐ నిబంధనల మేరకు కేవైసీ వెరిఫికేషన్‌ చేయకుండా, భారీ లోన్‌ మొత్తాన్ని లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయకుండా లీడర్లకు బై హ్యాండ్‌ నగదు రూపంలో అప్పగించడం వెనుక నాటి బ్యాంక్‌ అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత మేనేజర్‌ సైతం సిస్టమ్‌లో లాగినై ఇదంతా ఫోర్జరీ, మోసమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ఎస్పీని ఆశ్రయించగా, కేసును అల్లూరు పోలీస్‌స్టేషన్‌కు పంపారు. కారకులపై కఠిన చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు.

గ్రూప్‌ లీడర్ల ఫోర్జరీతో

రూ.20 లక్షలకు టోకరా

అల్లూరు వెలుగు ఆఫీస్‌ నుంచి ఆధార్‌ కార్డుల అపహరణ

బాధితురాలి పేరుతో

రూ.రెండు లక్షల లోన్‌ స్వాహా

ఫొటోలు నిందితులవి..

ఐడెంటిటీలు అమాయకులవి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement