వాకాడు: యూరియా పంపిణీకి సంబంధించి వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన నూతన యాప్‌లతో మండల రైతులు బుధవారం తీవ్ర అవస్థలు పడ్డారు. ఒకప్పుడు సులువుగా లభించే యూరియా నేడు అందని ద్రాక్షలా మారింది. నూతనంగా ప్రవేశపెట్టిన ఏపీఏఐఎమ్మెస్ యాప్‌లో తమ పొలం వివరాలు, ఖాతా నంబర్ తప్పనిసరిగా నమోదై ఉంటేనే ఎరువులను అందజేయనున్నామని అధికారులు కొర్రీలు పెడుతుండటంతో కార్యాలయ ఎదుట నిరసనను రైతులు బుధవారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లడారు. యూరియా కోసం ప్రైవేట్ డీలర్ల చుట్టూ వారం రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్నా, ఒక్క బస్తా సైతం లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుని మాన్యాలు, సీజేఎఫ్‌ఎస్, పొరంబోకు భూములను సాగు చేస్తున్న రైతులకు ఖాతా నంబర్ లేక, ఆన్‌లైన్ యాప్‌లో నమోదు కావడంలేదంటూ అధికారులను నిలదీశారు. దీన్ని అదునుగా తీసుకున్న కొందరు ప్రైవేట్ షాపుల యజమానులు.. స్థానిక వ్యవసాయాధికారులతో కుమ్మకై ్క నకిలీ డాక్యుమెంట్లను ఆన్‌లైన్లో నమోదు చేసి తద్వారా వచ్చిన యూరియాను పక్కదారి పట్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.


