● మైనింగ్ పేరుతో పిండి చేస్తున్నారు
● సహజ సిద్ధంగా ఉన్న కొండలు కనుమరుగు
● నావూరుపల్లి కొండపై మైనింగ్ వివాదం
● పశువుల మేతకు ఇబ్బందంటున్న గ్రామస్తులు
పొదలకూరు : సర్వేపల్లి నియోజకవర్గంలో కొందరు బ్రహ్మరాక్షసులు అవతారమెత్తారు. సహజ సంపదలను అనకొండల్లా తయారై మింగేస్తున్నా.. వారి ధనదాహం మాత్రం తీరడం లేదు. సహజ సిద్ధంగా ఏర్పడి ప్రకృతి రమణీయంగా ఉన్న కొండలు పిండి అవుతున్నాయి. మైనింగ్ పేరుతో తిప్పలను కొల్లగొట్టేందుకు టీడీపీ నేతలు బయట జిల్లాలకు చెందిన వ్యక్తులతో ఆయా గ్రామస్తులకు తెలియకుండానే ఎన్‌ఓసీలను పొందుతున్నారు. దీంతో పశువుల మేతకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కొండలపై బ్లాస్టింగ్ చేస్తే ప్రాణాపాయం ఏర్పడుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో సహజ సిద్ధంగా ఉన్న కొండలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే పొదలకూరు, మహ్మదాపురం, ఊసపల్లి, నందివాయ, గురవాయపాళెం, బత్తులపల్లి, ప్రభగిరిపట్నం గ్రామాల్లో మైనింగ్ లీజుల పేరుతో కొండలు కరిగిపోయాయి. పొదలకూరు చిట్టేపల్లి తిప్ప వద్ద గ్రావెల్ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. కొత్తగా నావూరుపల్లి గొట్టిగుండాల కొండకు మైనింగ్ అనుమతులు ఉన్నాయని కొందరు బయట వ్యక్తులు వెళ్లి భూమి పూజ నిర్వహించారు. గ్రామస్తులు ఎదురు తిరగడంతో వారు తాత్కాలికంగా భూమి పూజను మానుకున్నారు. ఇక్కడ మైనింగ్ చేస్తే పశువులకు మేతపొరంబోకు లేకుండా పోతుందని గ్రామస్తులు దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నారు. మైనింగ్ లీజుల దరఖాస్తుల వెనక పెద్ద తతంగమే జరుగుతోది.
107 జీఓ ప్రకారం దరఖాస్తులు
జీఓ ఎంఎస్ నంబరు 107 మైనింగ్‌కు దరఖాస్తులు సమర్పించుకున్న నెల రోజుల్లో సంబంధిత శాఖ అధికారులు విచారణ నిర్వహించి ఎన్‌ఓసీ అందజేయాలి. లేదంటే దరఖాస్తుదారుడికి అనుమతులు లభించినట్టే. గతంలో ఇదే ప్రకారం కొండలను తొలిచి మైనింగ్ చేసుకునేందుకు కొందరు అనుమతులను పొందారు. అయితే ఇక్కడ రెవెన్యూ, మైనింగ్ శాఖలే కాకుండా చివరగా పర్యావరణ పరిరక్షణ మండలి అభిప్రాయ సేకరణ కీలంగా ఉంటుంది. మైనింగ్ లీజులు పొందే వారు గోప్యంగా తమ పని కానిచ్చేస్తున్నారు. అనుమతులు వచ్చేంత వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.
మైనింగ్‌ను
వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు
నావూరుపల్లి గొట్టిగుండాల కొండ అనుమతుల్లో ఇదే జరిగింది. 2012లో అనుమతులు పొందిన మైనింగ్ వారి చేతులు మారుతూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా మరేదో కంపెనీ ఇక్కడ మైనింగ్ చేసేందుకు రావడంపై గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడో అనుమతులు లభించినా గ్రామస్తులు మాత్రం తమకు తెలియదని కొత్తగా అభిప్రాయ సేకరణ నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అనుమతులు ఉన్న వారు కొత్తగా ప్రజాభిప్రాయ సేకరణ ఉండదని, తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటున్నారు. దీనిపై అధికారులెవరూ జోక్యం చేసుకోవడం లేదు.


