● గూడూరులో వైఎస్సార్‌సీపీ
శ్రేణుల భారీ ర్యాలీ
● ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి
పెనుభారం మోపుతారా?
● ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్
చిల్లకూరు: పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, ఇప్పుడు ధరలు విపరీతంగా పెంచి సామాన్యులపై పెనుభారం మోపుతున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడ్డాయి. కేంద్రం ఇంధన ధరలు పెంచుతుండగా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గూడూరులో ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని విమర్శించారన్నారు. ఇప్పుడు కేంద్రం వరుసగా ధరలు పెంచుతున్నా ఎవరూ స్పందించకపోవడం దారుణమన్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. డీజిల్ ధరల పెరుగుదలతో రైతులు, ఆటో కార్మికులు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని, వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గూడూరు మున్సిపాలిటీలో ప్రోటోకాల్ అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పశ్చిమాసియా యుద్ధాన్ని కారణంగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతోందని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనతో విద్యార్థుల జీవితాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. అన్ని రంగాల్లో విఫలమవుతున్న కేంద్రాన్ని టీడీపీ ప్రశ్నించకుండా మిన్నకుండిపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, పలగాటి సంపత్‌కుమార్‌రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఈసీ సభ్యుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, జగనన్న సేవా సమితి అధ్యక్షుడు ఊటుకూరు మహేంద్రరెడ్డి, సీనియర్ నాయకులు చేవూరు విజయమోహన్‌రెడ్డి, దువ్వూరు మధుసూదన్‌రెడ్డి, పోలుబోయిన చెంగయ్య, నాగిశెట్టి శారదమ్మ తదితరులు పాల్గొన్నారు.


