● వింజమూరులో పాలవాగు వద్ద
మృతదేహం గుర్తింపు
● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
వింజమూరు(ఉదయగిరి): కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామానికి చెందిన మేదరమిట్ల శ్రీకాంత్ (32) అదృశ్యమైన కొద్దిరోజులకే శవంగా మారిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బంధువుల కథనం మేరకు.. శ్రీకాంత్ కలిగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడికి మద్యం తాగే అలవాటు ఉంది. గత శనివారం మధ్యాహ్నం పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే కలవలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువుల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. ఆదివారం కలిగిరి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
రెండు మృతదేహాలంటూ..
మంగళవారం మధ్యాహ్నం వింజేటమ్మ గుడి మార్గంలో పాలవాగు వద్ద రెండు మృతదేహాలున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిశీలనలో ఒకే మృతదేహంగా తేలింది. సమీపంలో ఉన్న మోటార్‌బైక్ నంబర్ ఆధారంగా మృతుడిని గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. మృతుడి తండ్రి ఎం.వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. ఉదయగిరి సీఐ పోతుగంటి సుబ్బారావు, ఎస్సై మాదాల ఉమా మహేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
అనుమానాలకు తావిస్తున్న ఘటన
మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండటంతో అదృశ్యమైన రోజే చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. మద్యం తాగిన ఆనవాళ్లున్నాయి. మరికొద్ది దూరంలో మృతుడికి చెందిన ఒక కాలు చెప్పు, మరొకరికి చెందిన చెప్పులున్నాయి. దీంతో ఇది హత్యా? లేక మద్యం మత్తులో చనిపోయాడా?, లేక ఇతర కారణాలున్నాయా? అనే అంశాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణలో వెలుగు చూసే అవకాశం ఉంది.


