● కుంట పోరంబోకు భూమిలో పనులు
● పట్టించుకోని అధికార యంత్రాంగం
ఉదయగిరి: కలిగిరి మండలం తూర్పుగుడ్లదొన గ్రామంలో సర్వే నంబర్ 1021లో ఉన్న 3.28 ఎకరాల కుంట పోరంబోకు భూమి ఆక్రమణ వ్యవహారం మళ్లీ వివాదాస్పదమైంది. ఇటీవల ’సాక్షి’లో కథనం వెలువడిన అనంతరం అధికారులు పనులు నిలిపి వేయించినా, కొద్దిరోజుల తర్వాత మంగళవారం తిరిగి చదును పనులు ప్రారంభించారు. ఈ కుంటను గ్రామ అవసరాలకు, పశువుల తాగునీటి కోసం ఉపయోగిస్తున్నామని కొత్తపాళెం గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆక్రమణదారుడు మాత్రం 2004లో అప్పటి తహసీల్దార్ నుంచి 34 ఏళ్లకు లీజు పొందినట్లు చెబుతున్నాడు. నిబంధనల ప్రకారం కుంట పోరంబోకు భూములు లీజుకు ఇవ్వకూడదని, ఒకవేళ ఇచ్చినా అవి రద్దు చేయాల్సిందే తప్ప ఆక్రమణదారుడికి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు పంపి ఆక్రమణదారుడికి మద్దతు ఇస్తున్నారని విమర్శలున్నాయి. ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు గ్రామస్తులను బైండోవర్ చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్రమణదారుడు యథేచ్ఛగా పనులు కొనసాగిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి విలువ సుమారు రూ.70 లక్షల వరకు ఉండటంతోనే ఈ ఆక్రమణలకు అధికారుల వైపు నుంచి ప్రోత్సాహం లభిస్తోందని ప్రచారం జరుగుతోంది. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఆక్రమణ పనులు నిలిపివేసి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.


