కలువాయి(సైదాపురం): వెంకటరెడ్డిపల్లి జంక్షన్, కుల్లూరు జాతీయ రహదారి పక్కనున్న భూముల ధరలు భారీగా పెరిగాయి. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం వెంకటరెడ్డిపల్లి వద్ద నుంచి, అలాగే కుల్లూరుపెయ్యాలతిప్ప పరిధిలోని ప్రభుత్వ భూముల నుంచి రాత్రింబవళ్లు వందల సంఖ్యలో ట్రాక్టర్లతో గ్రావెల్‌ను తరలిస్తున్నారని సమాచారం. హైవే పక్కన ఉన్న భూములకు తరలించి అక్కడే విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. అక్రమ రవాణాకు సంబంధిత అధికారులకు మామూళ్లు అందుతుండటంతో ఎవరూ అడ్డుకునే పరిస్థితి లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇటువంటి స్థాయిలో దోపిడీ ఇంతకుముందెన్నడూ చూడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కలువాయి మండలంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్, ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


