నెల్లూరురూరల్: ‘అయ్యా.. మా వినతులు పరిశీలించి అండగా ఉండండి’ అంటూ ప్రజలు అధికారులను కోరారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, తెలుగుగంగ ప్రత్యేక అధికారులు కేశవర్ధన్‌రెడ్డి, వంశీకృష్ణ, ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ అర్జీలను స్వీకరించారు.
● అంగన్‌వాడీ ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలని గిరిజన సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి కొమరగిరి మహేంద్రబాబు తదితరులు కోరారు. వారు మాట్లాడుతూ ఎస్టీ కాలనీల్లో ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టులను స్థానికులకు ఇవ్వకుండా స్థానికేతరులకు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మండల, జిల్లా స్థాయి అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినప్పటికీ స్పందన లేదన్నారు. కార్యక్రమంలో యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, యానాది సంఘం జిల్లా నాయకులు ఇండ్ల రవి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
● జిల్లాలో ఆర్‌టీఐ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని నెల్లూరుకు చెందిన వి.సురేష్ కోరారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు కార్యాలయాల్లో ఆర్‌టీఐ చట్టం పకడ్బందీగా అమలు కావడం లేదని ఆరోపించారు. అవసరమైన సమాచారాన్ని పూర్తిగా ఇవ్వకుండా అరకొర సమాచారం మాత్రమే అందిస్తున్నారని తెలిపారు. అన్ని కార్యాలయాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
● విద్యార్థుల మార్కులు, ర్యాంకుల పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న విచ్చలవిడి ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పీఏఏపీ) జిల్లా కమిటీ నాయకులు కోరారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 9 ప్రకారం విద్యార్థుల మార్కులు, ర్యాంకులను హోర్డింగులు, పత్రికలు, వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం నిషేధమన్నారు. అయినా జిల్లాలో పలు విద్యాసంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీ హోర్డింగులు, ప్రకటనల ద్వారా ప్రచారం కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో పీఏఏపీ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి శిఖరం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడుత రాజశేఖర్ యాదవ్, ఉపాధ్యక్షుడు షేక్ మునాఫ్ తదితరులు పాల్గొన్నారు.
● బక్రీద్‌కు సంబంధించి ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) నాయకులు కోరారు. అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ నమాజ్ నిర్వహణకు ప్రత్యేక స్థలం కేటాయించాలన్నారు. ఇమామ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌పీఎంను పునః ప్రారంభించాలి
ఆత్మకూరు డివిజన్ పరిధిలో మూతపడిన ఎస్‌పీఎంను వెంటనే పునఃప్రారంభించాలని సీపీఎం ఆత్మకూరు పట్టణ కమిటీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. డివిజన్ పరిధిలోని 10 మండలాల రైతులు, వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు నెల్లూరుపాళెం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ మెకానిజం ఏర్పాటు చేశారన్నారు. ఆరు నెలలుగా ఇది మూతపడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరమ్మతుల కోసం నెల్లూరుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇందుకు భారీ మొత్తంలో ఖర్చవుతుందన్నారు. ఇప్పటికే ధాన్యానికి గిట్టుబాటు ధరల్లేక ఇబ్బందులు పడుతున్న రైతులు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యతో మరింత ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
అర్జీలు స్వీకరించిన అధికారులు
రైతుల ఇబ్బందులపై ఫిర్యాదు
రంగడి ఆలయ చైర్మన్ ఇంటి స్థలం
ఆక్రమించాడు
ఆవేదన వ్యక్తం చేసిన మహిళ
స్థలాన్ని టీడీపీ నేత ఆక్రమించాడు
తన ఇంటి స్థలాన్ని టీడీపీకి చెందిన లెక్కల వెంకారెడ్డి ఆక్రమించాడని నవాబుపేటకు చెందిన రావిళ్ల సుగుణమ్మ వినతిపత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం అతను రంగనాథ స్వామి ఆలయ చైర్మన్‌గా కొనసాగుతున్నట్లు తెలిపారు. పలుమార్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనపై దౌర్జన్యానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. తనకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ ఉద్యోగుల వినతి
ఆర్టీసీ సంస్థ పరిరక్షణతోపాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సంఘాల నాయకులు కోరారు. కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు ఓవీ ప్రసాద్, కార్యదర్శులు మాట్లాడుతూ ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సీ్త్ర శక్తి పథకం రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. సిబ్బందిపై దాడులు చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. 11వ పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని కోరారు. నైట్ హాల్ట్ బస్సులకు అలవెన్స్‌లు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.


