అధికార పార్టీ అండతో పేదలపై జులుం | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ అండతో పేదలపై జులుం

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

మనుబోలు: అధికార పార్టీ అండతో ఓ వ్యక్తి పెద్దఎత్తున రొయ్యల గుంతలు ఏర్పాటు చేస్తూ సాగు భూములకు ఇబ్బందులు సృష్టిస్తున్నాడని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పిడూరుపాళెం, బద్దెవోలు, పిడూరు గ్రామాలకు చెందిన పలువురు దళిత రైతులు సోమవారం రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్‌ రమాదేవికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బద్దెవోలుకు చెందిన టీడీపీ నాయకుడు బత్తల వెంకటరమణయ్య పిడూరుపాళెం పరిధిలో 81, 82, 83, 84 సర్వే నంబర్లలో 150 ఎకరాల సీజేఎఫ్‌ఎస్‌ భూములను కొనుగోలు చేసి రొయ్యల గుంతలు ఏర్పాటు చేస్తున్నాడన్నారు. ఆదివారం రాత్రి తాము అడ్డుకోగా కులం పేరుతో దూషిస్తూ దౌర్జన్యం చేశాడని వాపోయారు. గుంతలు ఏర్పాటు చేసే క్రమంలో పంట కాలువను సైతం పూడ్చి వేశారని ఆరోపించారు. అడ్డుగా ఉన్న కాలువలు, డొంకను ఆక్రమించుకోవడంతో ఆ ప్రాంతంలో 600 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. మనుబోలు, పిడూరు, పిడూరుపాళెం, ఎల్‌ఎన్‌పురం గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. గుంతల సాగును వెంటనే ఆపకపోతే సామూహిక ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement