● తమను రక్షించాలన్న గ్రామస్తులు
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని నేలటూరులో నెలకొన్న కాలుష్య సమస్యపై అధికారులు పరిశీలించి వెళ్లిపోవడం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరారు. ఇటీవల స్థానికులు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్పందించిన అధికారులు సోమవారం గ్రామానికి వచ్చి పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం ప్రభావంతో కొన్నేళ్లలో దాదాపు 20 మందికి పైగా మృతిచెందినట్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా అనేక మంది విచిత్రమైన వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. పశువులు, వ్యవసాయ భూములు కూడా కాలుష్య ప్రభావానికి గురవుతున్నాయని వాపోయారు. గ్రామాల తరలింపుపై గతంలో సర్వేలు నిర్వహించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి గ్రామాన్ని కాలుష్య ముప్పు నుంచి రక్షించాలని కోరారు.


