దేశంలోనే ఏపీలో పెట్రోల్‌ ధరలు అధికం | - | Sakshi
Sakshi News home page

దేశంలోనే ఏపీలో పెట్రోల్‌ ధరలు అధికం

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

వెంకటాచలం: దేశంలో రాష్ట్రంలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉన్నాయని, ప్రజలపై చంద్రబాబు మోపిన అధిక ధరలు తగ్గించేంత వరకు తమ పోరాటాలు ఆగవని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వెంకటాచలంలో సోమవారం కాకాణి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక సర్వేపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ఎడ్ల బండిని నడుపుతూ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఇన్‌చార్జి తహసీల్దార్‌ విజయ్‌కు వినతిపత్రం అందజేశారు. కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజల్‌ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయని, ఒకేసారి రూ.3,391 కోట్ల భారాన్ని మోపిందని ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల ముందు పెట్రోల్‌ బంక్‌ల లోకేషన్ల వద్ద సెల్ఫీలు తీసుకున్న లోకేశ్‌ ఇప్పుడు కూడా సెల్ఫీలు తీసుకోగలడానని ప్రశ్నించారు. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ట్యాక్స్‌ తగ్గించాల్సింది పోయి, మరింత పెంచి ప్రజలపై భారం మోపడం దారుణమని మండిపడ్డారు. డీజిల్‌ ఽలీటరు ధర రూ.97.63 ఉండగా రూ.3.14 పెంచడంతో రూ.100.77లకు, పెట్రోల్‌ ధర రూ.109.85 ఉండగా, రూ.3.29 పెంచడంతో రూ.113.14లకు పెరిగిందన్నారు. ఎన్నికల ముందు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచబోమని, అప్పటికే ఉన్న ధరలను తగ్గిస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబు చెబుతున్న పొదుపు మంత్రం పేద ప్రజలకే తప్ప, చంద్రబాబు కుటుంబానికి వర్తించదానని ధ్వజమెత్తారు. కొన్ని అనుకూల మీడియా చానళ్లలో లోకేశ్‌ కేవలం రెండు కార్ల కాన్వాయ్‌లోనే వెళ్తున్నట్లు చూపించారని, అయితే లోకేశ్‌, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడికి వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలు వాడుతున్నారని, అది పొదుపు మంత్రం ఎలా అవుతుందన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఉక్రెయిన్‌ యుద్ధం, కరోనా వంటి తీవ్ర సంక్షోభాలు, విపత్తులు వచ్చినప్పటికి అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలపై భారం మోపకుండా అండగా నిలిచారని గుర్తు చేశారు. పేదలపై భారం పడకుండా సుపరిపాలన అందించాలనే ఆలోచనతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పని చేసిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement