● అవగాహనతోనే చెక్
● జిల్లా వైద్యశాఖలో కాకి లెక్కలు
● వరల్డ్ మలేరియా డే నేడు
నెల్లూరు(అర్బన్): ప్రజలకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో మలేరియా ఒకటి. ప్రతి సంవత్సరం దేశంలో లక్షలాది మంది ఈ వ్యాధిన పడుతున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీని వరల్డ్ మలేరియా డేగా ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
దోమ కాటుతోనే వ్యాప్తి
మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇది దోమ లాలాజలంలో నివాసం ఏర్పరుచుకుంటుంది. ఆడ అనాఫిలస్ అనే దోమ కుట్టినప్పుడు దాని లాలాజలం ద్వారా ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి మానవుని రక్తంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత మలేరియా అనే జబ్బును కలిగిస్తాయి. నీటిగుంతలు ఎక్కువగా ఉండే చోట దోమల పునరుత్పత్తి జరిగి వాటి ద్వారా రోగం వస్తుంది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా విస్తరిస్తాయి.
ఈ లెక్కలేంటో..
జిల్లాలో సీజనల్లో వివిధ ప్రాంతాల్లో ఒకప్పుడు వందలాది కేసులు నమోదయ్యేవి. అయితే ఆ ప్రాంతాలతోపాటు మరికొన్నిచోట్ల కొన్నేళ్లుగా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా అడపాదడపా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కేసులు తరచూ నమోదవుతూనే ఉన్నాయి. సంవత్సరం మొత్తంగా వందలాదిగా వస్తున్నా వైద్యశాఖలో మాత్రం జిల్లా మొత్తానికి కలిపి 5 లేదా 10 కేసులు మాత్రమే నమోదవుతున్నట్టు కాకిలెక్కలు చూపుతున్నారు. ఉదాహరణకు శంకరాగ్రహారంలోని ఒక ప్రజా వైద్యశాలలో రెండు నెలల డేటాను పరిశీలిస్తే పదుల సంఖ్యలో రోగులున్నట్లు తేలింది. అలాగే నారాయణ, మెడికవర్, అపోలో, కిమ్స్, పెద్దాస్పత్రి, జయభారత్ ఆస్పత్రి ఇలా పలుచోట్ల మలేరియా కేసులు వస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వైద్యశాఖలో ఒకటో, రెండో నమోదు చూపి చేతులు దులుపుకొంటున్నారని విమర్శలున్నాయి.
ఎన్నో రకాలు
మలేరియాను కలిగించే పరాన్న జీవులు ఐదు రకాలుగా ఉన్నాయి. అవి ప్లాస్మోడియం ఫాల్సిపారం, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవాలే, ప్లాస్మోడియం నోలెసి. మన ప్రాంతంలో ప్రధానంగా మూడు రకాలు మలేరియాను కలిగిస్తాయి. వీటిలో ప్లోస్మోడియం ఫాల్సిపారం అత్యంత ప్రమాదకరమైంది. ప్రాణా పాయం సంభవించవచ్చు. ఈ రకమైన జీవి మనిషి మెదడును కూడా దెబ్బతీస్తుంది. రక్తపరీక్షల్లో వైవాక్స్ మలేరియా అయితే రెండు వారాలు పూర్తిగా చికిత్స తీసుకోవాలి. ఫాల్సిపారం మలేరియా అయితే మూడు రోజులపాటు ఏసీటీ చికిత్స తీసుకోవాలి. డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి.
సంవత్సరం ప్రభుత్వ లెక్కలు ప్రైవేట్
ఆస్పత్రిలో..
2021 12 63
2022 3 56
2023 1 62
2024 6 73
2025 5 67
2026 0 21
లక్షణాలు ఏంటంటే?
జ్వరంతోపాటు చలి, వణుకు, తలనొప్పి, వాంతులు, వికారం, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తే మలేరియా జబ్బు కావచ్చు. దీనిని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేయించుకోవాలి. నిర్ధారణ అయితే చికిత్స చేయించుకోవాలి. ఇళ్ల చుట్టూ నిలువ నీరు లేకుండా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా మస్కిటో నెట్స్ ఉపయోగించాలి. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. నీటి ట్యాంక్‌లను మూసేయాలి. దోమల నిర్మూలన జరిగితే మలేరియా కూడా నియంత్రణ జరిగినట్టే.
జిల్లాలో ఇలా..
నియంత్రణలో కేసులు
జిల్లాలో మలేరియా కేసులను నియంత్రించగలిగాం. 2026లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు దోమకాటుకు దూరంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు కుట్టకుండా, పుట్టకుండా చూసుకోగలిగితే మలేరియాను పారదోలినట్టే.
– డాక్టర్.టి.అంశుధర్, ఇన్‌చార్జి
జిల్లా మలేరియా నివారణాధికారి, వైద్యశాఖ
నిర్మూలనే అంతిమ లక్ష్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 2030 నాటికి మలేరియాను నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చలి, వణుకుతో కూడిన జ్వరం వస్తుంటే ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోవాలి. మలేరియా నిర్ధారణ అయితే ఖర్చు లేకుండా చికిత్స అందిస్తున్నాం. ప్రజలు కూడా అవగాహన కలిగి ఇల్లు, పరిసరాల్లో నీరు నిలబడే గుంతలు లేకుండా చూసుకోవాలి. దోమతెరలు వాడాలి. – డాక్టర్ సుజాత, డీఎంహెచ్‌ఓ, జిల్లా వైద్యశాఖ


