● ఎస్‌ఈ రాఘవేంద్రం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సూర్యఘర్ ఉత్సవ్‌లో భాగంగా యుద్ధప్రాతిపదికన జిల్లాలోని 32,534 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందించేందుకు రూ.390 కోట్లు ఖర్చు కానుందని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ రాఘవేంద్రం తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్‌లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్కో వినియోగదారుడికి అయ్యే రూ.1,20,000 ఖర్చును కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందన్నారు. కోవూరు డివిజన్‌లో 6,500 మందికి, కావలి డివిజన్‌లో 586, నెల్లూరు రూరల్ డివిజన్‌లో 10,471, ఆత్మకూరు డివిజన్‌లో 557, నెల్లూరు టౌన్ డివిజన్‌లో 2,131 మందికి అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో 6 వేల మందికి అవసరమైన ప్యానెల్స్ సిద్ధం చేశామన్నారు. మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళి, సోలార్ విద్యుత్ నోడల్ ఆఫీసర్ శేషాద్రి బాలచంద్ర, జిల్లాకు చెందిన ఈఈలు శ్రీధర్, రమేష్ చౌదరి, భానూనాయక్, నరేంద్రరెడ్డి, బెనర్జీ, ప్రసాద్, పరంధామయ్య, డీఈఈలు, సోలార్ వెండర్స్ పాల్గొన్నారు.


