ఆహార కల్తీపై కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఆహార కల్తీపై కఠిన చర్యలు

Apr 8 2026 7:56 AM | Updated on Apr 8 2026 7:56 AM

18 హోటళ్లపై క్రిమినల్‌ కేసులు

రూ.1.25 లక్షల జరిమానా

జేసీ మొగిలి వెంకటేశ్వర్లు

నెల్లూరు(దర్గామిట్ట): కల్తీ ఆహార పదార్థాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ మొగిలి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్ట్స్‌ యాక్ట్‌ 2006 ప్రకారం జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీలపై నెల్లూరులోని తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు వ్యాపారులకు మొత్తం రూ.1.25 లక్షల జరిమానా విధించినట్లు జేసీ తెలిపారు. అదేవిధంగా, నిషేధిత రంగులతో ఆహారం తయారు చేసి విక్రయించిన కేసుల్లో జిల్లాలోని 18 హోటళ్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని హోటళ్లు, ఆహార పదార్థాల విక్రయదారులు ఫుడ్‌ సేఫ్టీ లైసెన్స్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ వెంకటేశ్వరరావు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ప్రణతి ఫ్లోరా, నీరజ తదితరులు పాల్గొన్నారు.

అటవీ ప్రాంతంలో మొక్కల పెంపకం

సైదాపురం: నెల్లూరు రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మొక్కల పెంపకం చేపడుతున్నట్లు రేంజర్‌ మాల్యాద్రి వెల్లడించారు. మండల కేంద్రం సమీపంలో ఉన్న సైదాపురం సెంట్రల్‌ నర్సరీని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ సెంట్రల్‌ నర్సరీలో 2 లక్షల మొక్కల పెంపకం చేపడుతున్నట్లు వెల్లడించారు. నర్సరీ ద్వారా ప్రజలకు 50 వేల మొక్కలను ఆగస్ట్‌ నుంచి అందిస్తామన్నారు. 16 రకాల మొక్కల పెంపకం చేపడుతున్నామన్నారు. అక్రమ మైనింగ్‌ నిరోధించేందుకు ప్రత్యేక కందకపు పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. వన్యప్రాణులను ఎవరైనా వేంటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట బీఓ రవిశేఖర్‌ తదితరులున్నారు.

బైక్‌ను ఢీకొట్టిన స్కూల్‌ బస్సు

ఒకరి మృతి

కలువాయి(సైదాపురం): స్కూల్‌ బస్సు మోటార్‌బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో మంగళవారం ఒకరు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. కలువాయి మండలం నూకనపల్లికి చెందిన కలువాయి పెంచలయ్య, అనంతసాగరం మండలం పడమటికంభంపాడు గ్రామానికి చెందిన ఉదయగిరి బాబు (27) బైక్‌పై తోపుగుంట నుంచి కలువాయికి వెళ్తున్నారు. దారిలో ఓ స్కూల్‌కు చెందిన బస్సు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో స్థానికులు గమనించి క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయగిరి బాబు మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై కోటయ్య ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

కుటుంబ కలహాలతో..

యువకుడి ఆత్మహత్య

ఆత్మకూరురూరల్‌: మండలంలోని నువ్వూరుపాడుకు చెందిన వనపర్తి ప్రవీణ్‌ (21) అనే యువకుడు కుటుంబ కలహాలతో మార్చి 16న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఆత్మకూరు ఎస్సై జిలానీ కథనం మేరకు.. అనంతపురం జిల్లాకు చెందిన ప్రవళ్లికతో ప్రవీణ్‌కు వివాహమైంది. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో జరిగిన కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రవీణ్‌ మద్యంలో గడ్డిమందు కలిపి తాగాడు. కుటుంబ సభ్యులు గుర్తించి తొలుత ఆత్మకూరులో చికిత్స చేయించారు. తర్వాత తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లారు. ప్రయోజనం లేకపోవడంతో నెల్లూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలో చే ర్పించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి తల్లి తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

పొదలకూరు

నిమ్మధరలు (కిలో)

పెద్దవి: రూ.140

సన్నవి: రూ.100

పండ్లు: రూ.80

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement