అల్లూరు: ప్రాణాలకు తెగించి పట్టుకుని మనకు అప్పగించిన బోట్లను జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా ముగ్గురు కాపులతోపాటు ఈ ద్రోహానికి తెగబడిన టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావును వదిలిపెట్టే ప్రసక్తే లేదని నాలుగు పంచాయతీల మత్స్యకారులు ఏకోన్ముఖంగా తీర్మానించారు. ఈ వ్యవహారానికి సంబంధించి సోమవారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలో జరిగిన 164 గ్రామాల మత్స్యకారుల సమావేశంలో బోట్లకు బాధ్యత వహించిన మూడు గ్రామాలకు రూ.5 కోట్లు జరిమానా విధించిన నేపథ్యంలో బుధవారం అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీ చంద్రబాబునగర్‌లో ఇస్కపల్లిపాళెం, బోగోలు మండలం చెన్నారాయునిపాళెం, జువ్వలదిన్నె, కావలి మండలం అన్నగారిపాళెం పంచాయతీల్లోని గ్రామాలకు చెందిన మత్స్యకారుల భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బోట్లను వదిలేసిన ఘటనకు కారణమైన ఇస్కపల్లిపాళెం, కొత్త బంగారుపాళెం, కొత్తకడపాళెం గ్రామాలు బాధ్యత వహించి రెండు కొత్త బోట్లను కొనుగోలు చేసి మత్స్యకారులకు అప్పగించాలని తీర్మానించారు. పాకలలో జరిగిన సమావేశానికి అయిన ఖర్చును ఈ మూడు గ్రామాలే భరించాలని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని త్వరలో జరగబోయే మరో సమావేశంలో అన్ని మత్స్యకార గ్రామాలకు తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కలెక్టర్‌తో నేటి సమావేశం బహిష్కరణ
మత్స్యకారుల సమస్యలపై గురువారం నెల్లూరులోని టౌన్‌హాల్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా, మత్స్యశాఖాధికారులతో నిర్ణయించిన సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు నాలుగు పంచాయతీల్లోని గ్రామాల మత్స్యకారులు తీర్మానించారు. ఇంత కాలం తమను వాడుకుని, సమస్య వచ్చినప్పుడు కూడా మౌనంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు, మా ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లను వదిలేసి చేసిన ద్రోహాన్ని మేము మరిచిపోలేదు. దీని ఫలితంగా తమ సామాజికవర్గం నుంచి జీవిత కాలం బహిష్కరణకు గురికావాల్సిన పరిస్థితులు ఉత్పన్న మవుతున్నాయి. తప్పు చేసి, ద్రోహం తలపెట్టి తమనేదో ఉద్ధరించేందుకు అన్నట్లు మభ్య పెట్టేందుకు పెట్టిన సమావేశాలు మాకు అవసరం లేదు. మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం. తమకు ఎవరి సహకారం అవసరం లేదు. అందుకే కలెక్టర్‌తో మీటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు మత్స్యకారులు ముక్తకంఠంతో తీర్మానించారు.
తప్పు చేసిన వారు తగిన
మూల్యం చెల్లించకతప్పదు
బోట్ల విడుదల విషయంలో కారుకలైన ఎవరిని వదలబోకూడదని, ఎంతటి వారైనా సరే క్షమించే ప్రసక్తే లేదని మత్స్యకారులు స్పష్టం చేశారు. బోట్లు పట్టుకున్న గత ఆరు నెలల నుంచి మన ప్రాంతానికి మత్స్య సంపదను దోచుకునేందుకు ఇతర ప్రాంతాల వాళ్లు రాలేదని, బోట్లు విడుదలైన కొన్ని గంటలకే మళ్లీ తమ సముద్ర తీరానికి మత్స్య సంపదను దోచుకునేందుకు బోట్ల వస్తున్నాయని, దీనికి కార ణం రాజకీయ నాయకుల స్వార్థమే అన్నారు. ఇప్పు డు కూడా వీళ్ల మాటలు, అధికారుల మాటలు నమ్మితే మన జాతికి ద్రోహం చేసిన వాళ్లం అవుతాము. ఈ విషయంలో రాజీ పడితే మన సామాజికవర్గం నుంచి ఈ నాలుగు పంచాయతీలు జీవిత కాలం బహిష్కరణ శిక్షకు గురికావాల్సి వస్తుందంటూ కొందరు మత్స్యకార పెద్దలు స్పష్టం చేశారు. ముగ్గురు కాపులు స్వార్థానికి చేసిన తప్పునకు మూడు గ్రామాలు, నాలుగు పంచాయతీల్లోని మనం భారీ జరిమానా కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇంతలా తమ జీవనోపాధికి తీరని నష్టం కలిగించిన, ద్రోహం తలపెట్టిన ఏ ఒక్కరిని వదలబోకూడదని, తమతో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, మత్స్యకారులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో.. త్వరలోనే కారకులకు తెలియజేస్తామని ముక్తకంఠంతో పేర్కొన్నారు.
తప్పు చేసిన వారికి శిక్ష అయితే తప్పదు
ఎవరి కోసమో సామాజిక బహిష్కరణకు గురికావాల్సిన అవసరం లేదు
వదిలేసిన బోట్లకు మూడు గ్రామాలు బాధ్యత వహించాలి
అందరూ చందాలు వేసుకుని రెండు కొత్త బోట్లు కొనిపెడదాం
పాకల సమావేశం ఖర్చు కూడా మనమే భరించాలి
నేడు కలెక్టర్, మత్స్యశాఖాధికారుల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తీర్మానం


