పోలీసులతో ఘర్షణ పడుతున్న పూజిత, గౌరి తదితరులు
డీఎస్పీతో కాకాణి వాగ్వాదం
నెల్లూరు రూరల్: జర్నలిజం ముసుగులో అధికార పార్టీకి బ్రోకరిజం చేస్తూ ఆంధ్రబూతుజ్యోతి చెత్తపలుకులు పలుకుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు, ఆయన వంధిమాగాదులు చేస్తున్న అవినీతి, దోపిడీని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కళ్లకు కట్టినట్లు వివరించి, ప్రత్యామ్నాయంగా మావిగన్ రాజధాని ప్రతిపాదన చేస్తే టీడీపీతోపాటు అవినీతిపరుల కూసాలు కదులుతున్నాయన్నారు. మావిగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీకి చెందిన మహిళలను కించపరిచేలా ఆంధ్రజ్యోతి పత్రికలో, ఏబీఎన్ చానల్‌లో రాధాకృష్ణ రాసిన, ప్రసారం చేసిన బూతు రాతలు, రోత వ్యాఖ్యలపై ఆ పార్టీ శ్రేణులు బుధవారం కన్నెర్ర చేశాయి. పిచ్చిరాతలు రాసి, కారుకూతలు కూసిన రాధాకృష్ణ వైఖరికి నిరసనగా కాకాణి నేతృత్వంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, వైఎస్సార్‌సీపీ నేతలు, మహిళా నేతలతో కలిసి అయ్యప్పగుడి సమీపంలోని ఆంధ్రజ్యోతి ఎడిషన్ వద్ద నిరసన తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసు అధికారులు పత్రిక కార్యాలయానికి వెళ్లే అన్నీ మార్గాల్లో బారికేడ్లను, ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. నిరసన తెలిపేందుకు వెళుతున్న నేతలను వైఎస్సార్‌సీపీ శ్రేణులను రోప్‌లతో అడ్డుకున్నారు. పోలీసుల అడ్డుకట్టలను ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ముఖ్యనేతలతోపాటు మహిళలు, పార్టీ కార్యకర్తలను శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనీ వెంటనే వెళ్లిపోవాలని లేదంటే అరెస్ట్‌లు చేస్తామంటూ పోలీసులు హెచ్చరించారు. బలవంతంగా పోలీస్ వాహనాల్లోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. దీనికి ముందు ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేసి రాధాకృష్ణ ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీచేశారు.
నాలుగు వైపులా బారికేడ్లు,
ఇనుప ముళ్ల కంచెలు ఏర్పాటు
రోప్ పార్టీలతో పార్టీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
పోలీసులు, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య వాగ్వాదం
ఖాకీల తీరుపై భగ్గుమన్న నేతలు
ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతుల దహనం


