భార్యను చెల్లెలుగా భావించి పెళ్లి చేసి పంపిస్తారంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులనుద్దేశించి రాసిన రాతలు అత్యంత జుగుప్సాకరం, హేయమని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ఖండించారు. రాధాకృష్ణ కచ్చితంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే టీడీపీ ప్రభుత్వం ఇంత మంది పోలీసులను పెట్టడం చూస్తే చంద్రబాబు, రాధాకృష్ణ మధ్య ఉన్న బంధం తేటతెల్లమవుతుందన్నారు. విలువలు లేని ఆంధ్రజ్యోతి విషం నింపుకొని ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తుందన్నారు. అప్పులు తెచ్చి ముంపునకు గురయ్యే ప్రాంతంలో రాజధాని పెట్టడం ఎంతవరకు సబబున్నారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి రాజధానిగా చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతివారం అప్పులు తెస్తే గానీ నడవని ప్రభుత్వం లక్షల కోట్లు అమరావతిలో ధారపోయడం అవసరమా అని ప్రశ్నించారు. ఒకే ప్రాంతంలో రూ. 2 లక్షల కోట్లు పెడితే మిగతా రాష్ట్ర పరిస్థితి ఏమిటని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలన్నారు.


