● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఉద్యోగం నుంచి సస్పెన్షన్ చేస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఏఆర్డీ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో ఐసీడీఎస్ అధికారులు మంగళవారం జిల్లా స్థాయి సమీక్షను నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు కార్యాలయాల్లో ఇంటర్నల్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల తమకు వచ్చిన సమాచారం మేరకు మండల రెవెన్యూ అధికారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. చిన్నపిల్లల చేత వీధుల్లో భిక్షమెత్తించే లీడర్లను గుర్తించి వారి పేర్లను తెలియజేయాలన్నారు. త్వరలో పోక్సో చట్టంపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి హేనాసుజన్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 304 వరకు ఇంటర్నల్ కమిటీలు ఏర్పడ్డాయన్నారు. మహిళలు నిర్భయంగా ముందుకొచ్చి వారికి జరిగిన అన్యాయాలను తెలియజేయాలని సూచించారు. సఖి – 1 సెంటర్‌లో ఫిర్యాదు చేయొచ్చన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ గంగా భవాని, బీసీ కార్పొరేషన్ అధికారిణి నిర్మలాదేవి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వందన, జహీర్ తదితరులు పాల్గొన్నారు.


