ఏఓ వాసును నిలదీస్తున్న వీఏఏలు
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల వ్యవసాయాధికారి ఎ.వాసు తీరు వివాదాస్పదమైంది. మహిళా వీఏఏను ఫోన్‌లో అసభ్య పదజాలంతో మాట్లాడటాన్ని నిరసిస్తూ బుధవారం స్థానిక కార్యాలయం ఎదుట వీఏఏలు నిరసన తెలిపారు. వివరాలు.. గుండెమడకల సచివాలయ పరిధిలో పనిచేస్తున్న వీఏఏ మేఘనను వింజమూరు కార్యాలయానికి బుధవారం రావాలని ఏఓ మంగళవారం చెప్పాడు. అయితే బుధవారం గుండెమడకల సచివాలయానికి డిప్యూటీ ఎంపీడీఓ తనిఖీకి రావడంతో ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. దీంతో ఏఓ.. వీఏఏకు ఫోన్ చేసి కార్యాలయానికి రావాల్సిందిగా చెప్పాడు.
సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆమె రాక ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి గురైన వాసు అసభ్య పదజాలంతో మాట్లాడాడు. ఆమె మనస్తాపానికి గురై కన్నీటిపర్యంతమైంది. విషయం తెలుసుకున్న సహోద్యోగులు ఏఓను నిలదీశారు. అయినా అతను ఎలాంటి పశ్చాత్తాపం చెందకుండా నేను ఇలాగే మాట్లాడతానంటూ అందరి ముందు దురుసుగా సమాధానమిచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వీఏఏ మేఘన భోరున విలపించింది. సచివాలయాల్లో మహిళా ఉద్యోగులకు భద్రత, గౌరవం కరువైందని మిగిలిన వీఏఏలు ఆవేదన వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణిని ఫోన్‌లో సంప్రదించగా వీఏఏలు ఈ అంశం తన దృష్టికి తీసుకురాలేదన్నారు. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్య పదజాలం ఉపయోగించిన అధికారులను ఉపేక్షించేది లేదని, కలెక్టర్ కూడా సీరియస్‌గా ఉన్నారన్నారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఏఓను వివరణ కోరగా పనిఒత్తిడితో తాను అసభ్య పదజాలంతో మాట్లాడిన విషయం వాస్తవమేనని, అదేమి తప్పు పదం కాదని సమ రి్థంచుకున్నాడు.


