పాపం మూగజీవాలు | - | Sakshi
Sakshi News home page

పాపం మూగజీవాలు

Apr 8 2026 7:56 AM | Updated on Apr 8 2026 7:56 AM

కోవూరు: అక్రమార్కుల కాసుల కక్కుర్తికి మూగజీవాలు నరకాన్ని అనుభవిస్తున్నాయి. వాటిని వాహనాల్లో కుక్కి సరిహద్దులు దాటిస్తున్నారు. కోవూరు నియోజకవర్గం మీదుగా నిత్యం మినీలారీల్లో జీవాలను తరలిస్తున్నారు. పాడి పరిశ్రమకు పట్టుగొమ్మలైన మన పశుసంపదను ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండటంతో భవిష్యత్‌లో పాల ఉత్పత్తి పడిపోయి, పాడి పరిశ్రమ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది.

నరకప్రాయం

సాధారణంగా పశువుల రవాణాకు కొన్ని నిబంధనలు ఉంటాయి. కానీ ఇక్కడ అవేవీ అమలు కావడం లేదు. లారీలు, మినీలారీల్లో సామర్థ్యానికి మించి పశువులను ఎక్కిస్తున్నారు. జీవాలు కదలకుండా వాటి కాళ్లను, మెడను బలమైన తాళ్లతో బిగిస్తున్నారు. ప్రయాణంలో కనీసం మేత, నీరు కూడా అందించకపోవడంతో గమ్యస్థానం చేరేలోపే కొన్ని ఊపిరాడక ప్రాణాలు విడుస్తున్నాయి. ఈ అక్రమ రవాణా వెనుక పెద్ద నెట్‌వర్క్‌ పనిచేస్తోంది. గ్రామాల్లోని దళారుల ద్వారా తక్కువ ధరకు పశువులను కొనుగోలు చేసి, రాత్రికి రాత్రే వాహనాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కబేళాలకు తరలించి భారీగా లాభాలు గడిస్తున్నారు. హైవేలపై తనిఖీ కేంద్రాల వద్ద కళ్లుగప్పి లేదా కొందరు అధికారుల అండదండలతో ఈ దందా సాఫీగా సాగుతోంది.

పాడి పరిశ్రమకు ముప్పు

ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో పాలు, పెరుగు కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన దుస్థితి వస్తుంది. ఉత్తమ జాతి పశువులను తరలించడం వల్ల స్థానికంగా పశుగణాంకాలు పడిపోతున్నాయి. వ్యవసాయం లాభసాటిగా లేని సమయంలో రైతుకు చేదోడుగా నిలిచే పాడి పరిశ్రమ దెబ్బతింటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. పశువుల సంఖ్య తగ్గితే పాల ధరలు పెరుగుతాయి. ఇంత జరుగుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై జంతు ప్రేమికులు, రైతులు మండిపడుతున్నారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి హైవేలపై నిరంతర నిఘా పెట్టాలని కోరుతున్నారు. పశువుల అక్రమ రవాణా నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలి. కంటైనర్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సరిహద్దులు దాటనివ్వాలి. ఇప్పటికై నా పాలకులు స్పందించి ఈ మాఫియాకు అడ్డుకట్ట వేస్తారో లేదో చూడాలి.

సరిహద్దులు దాటుతున్న

పాడి సంపద

ఒక్కో లారీలో సామర్థ్యానికి మించి పశువుల రవాణా

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement