నెల్లూరు(అర్బన్): ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేశాభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 పేరుతో నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అపోలో హాస్పిటల్స్ కృషి చేస్తున్నాయన్నారు. గతంలో వృద్ధాప్యంలో వచ్చే షుగర్, బీపీ, గుండెపోటు లాంటి జబ్బులు నేడు 20 ఏళ్ల నుంచే రావడం బాధాకరమన్నారు. స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుని ఆరోగ్య నియమాలు పాటించాలన్నారు. హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 ప్రకారం మన రాష్ట్రంలో 27 శాతం షుగర్, 22.5 శాతం బీపీ, 4.2 మంది రక్తహీనత, 81.8 శాతం అధిక బరువు కలిగి ఉండటం, 56.7 శాతం రక్తంలో కొవ్వు ఉన్న సమస్యలతో బాధపడే వారున్నారన్నారు. నెల్లూరులో కూడా ఇంచుమించు ఇవే శాతాలతో ఆ జబ్బులతో బాధపడుతున్నారన్నారు. అందువల్ల ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
చికెన్ వ్యర్థాల పట్టివేత
మర్రిపాడు: కర్ణాటక రాష్ట్రం నుంచి తరలిస్తున్న చికెన్ వ్యర్థాలను మర్రిపాడు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం చుంచులూరు క్రాస్‌రోడ్డు వద్ద ఎస్సై శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. బొలెరో వాహనంలో సుమారు 15 డ్రమ్ముల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, యజమానిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న వ్యర్థాలను రెవెన్యూ అధికారుల సమక్షంలో గ్రామం బయట పూడ్చివేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


