పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ మెషీన్ల చోరీ
● తర్వాత నగదు మాయం
● ఓ యువకుడి నిర్వాకం
ఆత్మకూరు: పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో ఆదివారం స్వైపింగ్ మెషీన్ చోరీకి గురైంది. కొద్దిసేపటి అనంతరం అందులో నుంచి నగదు మరో ఖాతాకు బదిలీ అయినట్లు యజమాని ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే సంగం, వింజమూరు, జలదంకి పెట్రోల్ బంకుల్లోనూ స్వైపింగ్ మెషీన్లు చోరీకి గురైనట్లు తెలిసింది. ఓ యువకుడు తన కార్డును స్వైప్ చేసి నగదు తీసుకున్నాడని, కొద్దిసేపటి అనంతరం మెషీన్ కనిపించలేదని బంకు సిబ్బంది తెలిపారు. పోలీసుల సమాచారం మేరకు చోరీ గురైన నాలుగు మెషీన్ల ద్వారా సుమారు రూ.2 లక్షలు నగదు మరో ఖాతాకు బదిలీ అయినట్లు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నగదు ఇవ్వాలంటూ..
సంగం: మండల కేంద్రమైన సంగంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో శనివారం స్వైపింగ్ మెషీన్ చోరీకి గురైంది. గుర్తుతెలియని యువకుడు వచ్చి కార్డు ఇస్తానని ద్వారా రూ.50 వేలు ఇవ్వాలని బంకు సిబ్బందిని అడిగాడు. వారు అలాగే చేశారు. కాసేపటి తర్వాత ఫోన్ చార్జింగ్ పెట్టుకుంటానంటూ లోపలికి వెళ్లాడు. అతను మెషీన్‌లోని రీఫండ్ ఆప్షన్ ద్వారా రూ.50 వేల నగదును తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు చెబుతున్నారు. బంకు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


