అటవీ అమర వీరుల స్ఫూర్తితో ప్రకృతిని కాపాడాలి
● డీఎఫ్‌ఓ మహబూబ్ బాషా
నెల్లూరు (అర్బన్): దుండగులు, స్మగ్లర్ల దాడిలో మృతి చెందిన అమరు వీరుల స్ఫూర్తితో సమాజం కోసం ప్రకృతి సంపదను, వనరులను కాపాడుకునేందుకు అటవీ శాఖాధికారులు, సిబ్బంది కృషి చేయాలని డీఎఫ్‌ఓ మహబూబ్‌బాషా సూచించారు. సోమవారం వేదాయపాళెంలోని జిల్లా అటవీశాఖాధి కార్యాలయంలో అటవీశాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అటవీ సంపదను కాపాడడంలో సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఘనంగా నివాళులర్పించారు. డీఎఫ్‌ఓ మహబూబ్‌బాషా మా ట్లాడుతూ ప్రకృతిని, పర్యావరణాన్ని, వన్యప్రాణులను కాపాడుకుంటేనే మన కు భవిష్యత్ ఉంటుందన్నారు. అటవీ సంపదను కాపాడడంలో వీరమరణం పొందిన వారి సేవలు మరచి పోకూడదన్నారు. వారి త్యాగాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు.
రక్తదానం, ఉచిత వైద్య శిబిరం
అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నారాయణ ఆస్పత్రి సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లాలోని పలువురు అటవీశాఖ సిబ్బంది రక్తదానం చేశారు. ఇదే సందర్భంలో సుమారు 200 మంది అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొబైల్ వాహనం ద్వారా ఎక్స్‌రే, స్కానింగ్ వంటి పరీక్షలతోపాటు రక్తపరీక్షలను నిర్వహించారు. మందులు అందజేశారు. నెల్లూరు రేంజ్ అధికారి మాల్యాద్రి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్ డీఎఫ్‌ఓ, అన్ని రేంజ్‌ల అధికారులు, ఏపీ జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ నాయకులు, మినీస్టిరియల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.


