ఆయకట్టు లెక్కల కనికట్టు
కనుపూరు కాలువ
పొదలకూరు : డెల్టాలో అతి పెద్ద కెనాల్, అత్యధిక విస్తీర్ణం సాగు జరిగే కనుపూరు కాలువ కింద ఈ రబీ సీజన్‌లో సాగుపై ప్రశ్నార్థకం నెలకొంది. గత రెండు రోజుల క్రితం జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో ఈ కెనాల్ కింద కేవలం 25 వేల ఎకరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నట్లు జలవనరులశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నీటి కేటాయింపులు వాస్తవ సాగు విస్తీర్ణంలో సగానికి కంటే తక్కువగా ఉంది. గతేడాది నవంబరు 8న జరిగిన ఐఏబీలో కనుపూరు కెనాల్ కింద 66 వేల ఎకరాలకు నీటిని కేటాయిస్తూ అధికారులు, పాలకులు ఆమోదం తెలిపారు. అయితే ఈ ఏడాది రబీకి నీటి కేటాయింపులు చూస్తే.. సర్కారు చెప్పకనే క్రాప్ హాలిడే ప్రకటించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అనాలోచితమా? ఉద్దేశ పూర్వక నిర్ణయమా? అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవంగా ఈ కాలువ కింద 25 వేల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు ఉంది. ఇది కాకుండా మరో 41 వేల ఎకరాల్లో అనధికారిక ఆయకట్టు కింద వరి సాగు జరుగుతోందని గత రబీకి ఐఏబీలో జలవనరుల శాఖ అధికారికంగా ప్రకటించిన నీటి కేటాయింపులను బట్టి స్పష్టమవుతోంది. కాలువ జీరో పాయింట్ వద్ద పొదలకూరు మండల ఆయకట్టు ఉండగా, తర్వాత నెల్లూరు రూరల్, మనుబోలు, వెంకటాచలం మండలాల్లో సుమారు 66 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లోనూ ఇదే స్థాయిలో నీటి కేటాయింపులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఐఏబీ సమావేశంలో నీటి కేటాయింపుల్లో 25 వేల ఎకరాలకే పరిమితం చేయడంతో రైతులు సాగుపై సందిగ్ధిత నెలకొంది.
నీటి విడుదలలోనూ ఇబ్బందులే
సంగం బ్యారేజీ నిర్మించిన తర్వాత కనుపూరు కాలువకు నీరు సక్రమంగా విడుదల అవుతున్నా.. కాలువకు నీటిని విడుదల చేసే స్లూయిజ్‌ల నిర్మాణం లోపభూయిష్టంగా జరిగిందని అప్పట్లో ప్రజాప్రతినిధులు అధికారులపై ధ్వజమెత్తారు. కాలువ వెడల్పు, లోతు ప్రకారం 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే స్లూయిజ్ నిర్మాణం ప్రకారం 1000 క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీనిపై అప్పట్లో కొంత చర్చ కూడా జరిగింది. అయితే కాలువ గుండా సాగునీరు అందుతున్న నేపథ్యంలో రైతులు సైతం మిన్నకుండిపోయారు. ప్రస్తుతం ఐఏబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కాలువకు 200 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటి ద్వారా రైతులు ముందుగా నార్లు పోసుకున్న తర్వాత కాలువకు నీటి విడుదలను పెంచుతామంటున్నారు. వెంకటాచలం మండలం తిక్కవరప్పాడు, కంటేపల్లి, మనుబోలు మండలం కొమ్మలపూడి, ముద్దముడి గ్రామాల వద్ద కనుపూరు కాలువకు బ్రాంచ్ కెనాల్స్‌ను నిర్మించి రెండు మండలాలకు సాగునీటిని అందిస్తున్నారు. మధ్యలో కాలువలకు కొంత మరమ్మతులు కూడా చేపట్టాల్సి ఉంది. పొదలకూరు మండలం యర్రబల్లికు వెళ్లే కాలువ బ్రిడ్జి దెబ్బతినడంతో రైతుల రాకపోకలు స్తంభించాయి. దీన్ని ఇప్పటి వరకు అధికారులు రిపేర్లు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వేపల్లిలో సర్కారు నిర్ణయం
జిల్లాలో డెల్టా ప్రాంతం కనుపూరు కెనాల్ కింద ప్రభుత్వమే క్రాప్ హాలిడే ప్రకటించిందా? అంటే.. అవునని జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) రబీ సాగుకు నీటి కేటాయింపులే విస్పష్టం చేస్తోంది. జలాశయాలన్నీ నిండుకుండగా ఉన్నాయి. అయినప్పటికీ అధికారిక ఆయకట్టులోనే సగం విస్తీర్ణణానికే నీటి విడుదలకు నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇది అధికారికంగా ప్రకటించిన క్రాప్ హాలిడేగా భావిస్తున్నారు. యూరియా సరఫరాకు కోత విధించడానికే నీటి కేటాయింపుల్లోనూ విస్తీర్ణం తగ్గించారంటూ మరో వైపు వాదన వినిపిస్తోంది.
కనుపూరు కాలువ ఆయకట్టుపై జలవనరుల శాఖ అధికారుల కనికట్టు లెక్కలు చెబుతున్నారని రైతులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ప్రతి రబీ సీజన్‌లో ఐఏబీ సమీక్షలో కేటాయిస్తున్న లెక్కలు చూడాలని అంటున్నారు. గతేడాది నవంబరు 8న జరిగిన ఐఏబీలో కూడా కనుపూరు కెనాల్ కింద 66 వేల ఎకరాలకు అధికారికంగా నీటిని కేటాయించారని రైతులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడెందుకు కేటాయింపులు తగ్గించారంటూ నిలదీస్తున్నారు. ఈ పరిస్థితిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి సైతం ప్రశ్నించి వదిలేయడంతో సాగుపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం అధికారికంగానే క్రాప్ హాలిడే ప్రకటించిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ కాలువ కింద స్థిరీకరణ ఆయకట్టు కంటే తీరువా జాస్తి (అనధికార ఆయకట్టు) ఎక్కువ ఉన్నందున యూరియా సరఫరాలో కోత విధించడానికే ఈ నిర్ణయం ప్రకటించిందా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం యూరియా పంపిణీకి కార్డులు అందజేస్తూ ఎకరాకు మూడు బస్తాలు మాత్రమే ఇస్తున్న నేపథ్యంలో అనధికారికంగా సాగు చేసే రైతులు, పాసుపుస్తకాలు లేని వారు యూరియాకు ఎక్కడకు వెళ్లాలో అయోమయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.
ఈ రబీలో 44 వేల ఎకరాలకు కోత
జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా ఐఏబీలో ప్రకటించే నీటి కేటాయింపులతో పోల్చితే ఈ రబీ సీజన్‌కు సుమారు 44 వేల ఎకరాలకు కోత పెట్టారు. ఇప్పటికే జలాశయాలు, జలవనరుల్లో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నాయి. డిసెంబరు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే వరద నీటిని ఇకపై ఎక్కడా నిల్వ చేసే అవకాశం కూడా లేదు. ప్రస్తుతానికి జలవనరుల శాఖాధికారులు వెల్లడించిన ప్రకారం జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువులు, జలాశయాల్లో 161 టీఎంసీలు నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే సీజన్ నాటికి అప్పటికి ఉన్న నీటి నిల్వలతో పాటు భవిష్యత్‌లో కురిసి వచ్చే నీటితో కలిపి 123.233 టీఎంసీల్లో డెడ్ స్టోరేజీ, ఆవిరయ్యే నీటికి పోను సోమశిల, కండలేరు కింద 7.77 లక్షల ఎకరాలకు సాగునీటిని కేటాయించారు. అయితే ప్రస్తుతం 161 టీఎంసీలు ఉన్నప్పటికీ ఈ ఏడాది కేవలం 7.23 లక్షల ఎకరాలకే కేటాయించారు. గతేడాది కంటే 38 టీఎంసీలు నీటి నిల్వలు అధికంగా ఉన్నప్పటికీ సుమారు 44 వేల ఎకరాలకు నీటి కేటాయింపులను తగ్గించారు. నీటి కేటాయింపులు తగ్గించడం వెనుక సర్కారు కుట్రలు కనిపిస్తున్నాయి. నీటిని హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌లకు, ఇతరాలకు అక్రమంగా తరలించడానికే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఐఏబీ సమావేశంలో రైతులు, రైతు సంఘాల నేతలో కలిసి చర్చించి నీటి కేటాయింపులు చేయడం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది ఐఏబీ సమావేశంలో వీరెవరూ లేకుండా చేయడం చూస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే రైతు సంఘాల నేతలు ఉండి ఉంటే.. దీనిపై కచ్చితంగా చర్చించి ఉండేవారు. ప్రధానంగా సోమశిల ప్రాజెక్ట్ పరిధిలో గతేడాది 5.51 లక్షల ఎకరాలకు సాగునీరు కేటాయిస్తే.. ఈ ఏడాది 5 లక్షలకే పరిమితం చేశారు. కండలేరు కింద గతేడాది 2.26 లక్షల ఎకరాలకు కేటాయిస్తే.. ఈ ఏడాది 2.23 లక్షల ఎకరాలకు పరిమితం చేశారు.
కనుపూరు కెనాల్ కింద 25 వేల ఎకరాల
అధికారిక ఆయకట్టు
అనధికారికంగా మరో 41 వేల ఎకరాల పైమాటే
అయితే ఐఏబీ సమావేశంలో కేవలం 25 వేల ఎకరాలకే సాగునీటి కేటాయింపు
గతేడాది ఇదే రబీ సీజన్‌లో 66 వేల
ఎకరాలకు నీటి విడుదలకు ఆమోదం
మిగతా విస్తీర్ణం సాగుపై రైతుల్లో అయోమయం
అనాలోచిత మా? ఉద్దేశ పూర్వక నిర్ణయమా?
ఇదంతా యూరియా సరఫరాకు
కోత విధించడానికేనా?
ఆయకట్టు లెక్కల కనికట్టు
ఆయకట్టు లెక్కల కనికట్టు


