వినతులిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి.. | - | Sakshi
Sakshi News home page

వినతులిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి..

Nov 11 2025 7:21 AM | Updated on Nov 11 2025 7:21 AM

వినతు

వినతులిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి..

కలెక్టరేట్‌లో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

పెద్ద సంఖ్యలో విచ్చేసిన అర్జీదారులు

యూరియా అందించాలని

రైతు సంఘం డిమాండ్‌

కౌలు రైతులను ఆదుకోవాలంటూ ధర్నా

నెల్లూరు రూరల్‌: ‘అయ్యా మా వినతులు పరిశీలించి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడండి’ అంటూ ప్రజలు కోరారు. నెల్లూరులోని కలెక్టరేట్‌లో ఉన్న తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి, డ్వామా పీడీ గంగా భవాని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 464 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ శాఖవి 162, పోలీస్‌వి 78, పంచాయతీరాజ్‌వి 42, మున్సిపల్‌ శాఖవి 31 తదితర శాఖల వినతులున్నాయి.

టీడీపీ వర్గీయులు భూములు ఆక్రమించారు

మా భూమిని టీడీపీ వర్గీయులు ఈ సంవత్సరం జనవరిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని వెంకటాచలం మండలం తిక్కవరపాడుకు చెందిన బోయపాటి రామానాయుడు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి బిట్‌ – 1లో సర్వే నంబర్‌ 2187లో ఉన్న మా భూమిని ఈ మధ్య రిటైరైన వీఆర్వో కందిమల్ల రామానాయుడు వాళ్ల బంధువులు పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారన్నారు. వీఆర్వోగా ఉన్నప్పుడు చేసినట్లు ఆరోపించారు. ఈసీ కూడా తమ పేరుతోనే ఉందని తెలిపారు. లోన్‌ తీసుకోవాలని చూస్తున్నారని చెప్పారు. రీ సర్వే చేయించాలని కోరారు. కొమ్మ రామయ్య, రమేష్‌ నాయుడు, శ్రీనివాసులు నాయుడు, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని వినతి

నెల్లూరు సిటీ 53, 54 డివిజన్ల పరిధిలో ప్రభుత్వ బ్యాంక్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు సీపీఎం నాయకులు వినతిపత్రం సమర్పించారు. నేతలు కత్తి శ్రీనివాసులు, మూలం ప్రసాద్‌ మాట్లాడుతూ రెండు డివిజన్లో పరిధిలో లక్ష మందికి పైగా ప్రజలు ఉంటున్నారన్నారు. అర్జీని స్వీకరించిన కలెక్టర్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నేతలు కత్తి పద్మ, గడ్డం శ్రీనివాసులురెడ్డి, ఎం.కృష్ణారావు, ఎం. భార్గవి, వి.లక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు వేయించండి మహాప్రభో..

దుత్తలూరు మండలం బండకిందపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని బీజేపీ మండలాధ్యక్షుడు లెక్కల వెంగళరెడ్డి కోరారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో రోడ్డు గుంతలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షాలు పడితే కనీసం నడవలేని పరిస్థితి వస్తుందన్నారు. నరవ్రాడ, కొత్తపేట, రంగన్నపాళెం గ్రామాలకు ఈ రోడ్డు నుంచే వాహనాలు వెళ్తున్నాయన్నారు.

యూరియా ఇవ్వాలని డిమాండ్‌

వరి సాగు చేసే రైతులకు యూరియా అందించాలని సీపీఐ రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ను కలిసి అర్జీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు దామా అంకయ్య మాట్లాడుతూ వ్యవసాయ పనులు ప్రారంభమమైనట్లు చెప్పారు. 15వ తేదీ నుంచి సోమశిల నీటిని కూడా విడుదల చేస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నేతలు షాన్‌వాజ్‌, గంగపట్నం రమణయ్య, యామల మధు, సయ్యద్‌ సిరాజ్‌, అజీజ్‌ అహ్మద్‌, ముక్తియార్‌, సుబ్బరాయుడు, రైతులు వెంకటసుబ్బయ్య, నరసయ్య, జానీ తదితరులు పాల్గొన్నారు.

చర్యలు తీసుకోవాలంటూ..

వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుల వద్దకు స్వయంగా కలెక్టర్‌ వచ్చి వినతిపత్రం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒంగోలు జిల్లాకు చెందిన కాలేషా అనే వ్యక్తి నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర నాయకుడని చెబుతూ జిల్లా వికలాంగుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ స్పందిస్తూ సదరు వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

దయ చూపండి సారూ..

రెండో ఏఎన్‌ఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సేవలందించే తమకు చాలీచాలని జీతం వస్తోందన్నారు. కుటుంబాన్ని పోషించడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. గతంలో నెలకు రూ.2 వేలు ఇన్సెంటీవ్‌, యూనిఫాం ఇచ్చేవారని, ఇప్పుడు అది కూడా లేదని వాపోయారు. ఎంటీఎస్‌ను అమలు చేయాలని కోరారు. 180 రోజుల చైల్డ్‌ కేర్‌ సెలవులు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరారు.

అన్నదాత సుఖీభవ కోసం..

కౌలు రైతులందరికీ నూతన చట్టం తీసుకొచ్చి అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా జరిగింది. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు తుళ్లూరు గోపాల్‌ మాట్లాడుతూ జిల్లాలో సుమారు లక్షమంది కౌలు రైతులున్నారని తెలిపారు. వారిలో చాలామందికి గుర్తింపు కార్డులు లేవన్నారు. వారిని ఆదుకోవాలన్నారు. యూరియాను సక్రమంగా అందించాలని కోరారు. కార్యక్రమంలో నేతలు మంగళ పుల్లయ్య, ముత్యాల గురునాథం, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

వినతులిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి.. 1
1/4

వినతులిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి..

వినతులిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి.. 2
2/4

వినతులిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి..

వినతులిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి.. 3
3/4

వినతులిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి..

వినతులిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి.. 4
4/4

వినతులిచ్చి.. ఆవేదన వెలిబుచ్చి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement