జిల్లాలో హైఅలర్ట్
● రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌ల్లో
పోలీసుల విస్తృత తనిఖీలు
నెల్లూరు (క్రైమ్): దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో ఎస్పీ అజిత వేజెండ్ల జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించడంతో జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, హోటల్స్, లాడ్జీలు, వ్యాపార కూడళ్లు, జన సామర్థ్యం అధికంగా ఉండే ప్రాంతాలు, పార్కింగ్ ప్లేస్‌లు, వాహనాలు తదితరాలను పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో నిశితంగా తనిఖీలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నగర ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు ముమ్మరం చేశారు. ఆర్టీసీ ప్రధాన బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్లు, నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌ల్లోని వెయిటింగ్ హాల్స్, స్టాల్స్, పార్శిల్ కేంద్రాలు, పార్కింగ్ ప్రదేశాల్లో బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లతో అణువణువు తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు, ప్రయాణికుల బ్యాగ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. వెయిటింగ్ హాల్స్‌లో వేచి ఉన్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరిస్తున్నారు. అదే క్రమంలో షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, హోటల్స్, లాడ్జీలు, వాణిజ్య సముదాయాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు. తనిఖీల్లో నగర ఇన్‌స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, జి. వేణుగోపాల్‌రెడ్డి, వైవీ సోమయ్య, కళ్యాణరాజు, శ్రీనివాసరావు, సాంబశివరావు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
రైల్వే పోలీసులు
రైల్వే సీఐ ఎ.సుధాకర్ ఆధ్వర్యంలో జిల్లా మీదుగా రాకపోకలు సాగించే అన్నీ రైళ్లతోపాటుగా రైల్వే ప్లాట్‌ఫాం పార్కింగ్ ప్రదేశాలు, జిల్లాలోని అన్నీ రైల్వేస్టేషన్ల జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు.


