పనికెళ్లి.. అనంతలోకాలకు
● సీలింగ్ కూలి కార్పెంటర్ మృతి
కోవూరు: నిర్మాణంలో ఉన్న ఇంట్లో సీలింగ్ కూలిపోయి ఓ కార్పెంటర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కోవూరు లక్ష్మీనగర్ ప్రాంతంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కోవూరుకు చెందిన పట్నం ప్రసాద్ (48) కార్పెంటర్. భార్య, పిల్లలున్నారు. లక్ష్మీనగర్‌లో ఓ ఇంట్లో పనిచేయడానికి వెళ్లాడు. పనులు కొనసాగుతున్న సమయంలో సీలింగ్ ఒక్కసారిగా ఊడి కూలి ప్రసాద్‌పై పడింది. దీంతో తలకు తీవ్రగాయమై కుప్పకూలాడు. సహచర కార్మికులు అతడిని బయటకు తీసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మతృదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సీలింగ్ పనుల్లో లోపమా?, లేక భద్రతా చర్యలు పాటించకపోవడమేనా అనే అంశంపై పోలీసులు సాంకేతిక నిపుణులతో కలిసి విచారణ చేస్తున్నారు. ప్రసాద్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. రోజూ నవ్వుతూ పనిచేసే ప్రసాద్ మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడంటూ సహచరులు ఆవేదన వ్యక్తం చేశారు.


