మహాశివునికే శఠగోపం పెట్టిన సోమిరెడ్డి
దేవదాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే ఇలాంటి చర్యలా?
దేవుడి భూములను కాజేసే వారిని రక్షించడమే సనాతన ధర్మమా?
దీనిపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఓ భక్తుడు మహాశివుడిపై భక్తిశ్రద్ధలతో ఇచ్చిన భూమిని కాజేస్తూ ఆయనకే శఠగోపం పెట్టిన ఘనుడు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్తీక మాసంలో భక్తులందరూ శివుడ్ని ఆరాధిస్తారని, అయితే సోమిరెడ్డి చేసిన పాపాలకు క్షమాపణ కోరేందుకే ఆయన శివాలయం చుట్టూ తిరుగుతున్నాడని ప్రజలు భావిస్తున్నారన్నారు. సర్వే నంబర్ 63–ఏ1లోని 0.48 సెంట్ల భూమిని డాక్యుమెంట్ నంబర్ 23/1980 ప్రకారం ఆలూరు హరిప్రసాద్‌రెడ్డి అనే భక్తుడు కాకుటూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయానికి అన్ని హక్కులు వర్తింపజేస్తూ, రిజిస్టర్ చేశాడని, ఆ భూమి శివాలయం ఆధీనంలో ఉందన్నారు. అయితే సోమిరెడ్డి కోటి రూపాయలు పుచ్చుకొని, శివాలయానికి చెందిన 0.48 సెంట్ల భూమిలో రియల్ ఎస్టేట్ యజమానుల కోసం సిమెంటు రోడ్డు నిర్మించాడన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు దేవుడి భూమిని కాజేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు.
ట్యాంకర్లపై దారి దోపిడీ
సర్వేపల్లి నియోజకవర్గంలో మట్టి, ఇసుక, గ్రావెల్, బూడిదను సోమిరెడ్డి దోచుకుంటున్నాడని, బల్కర్ల నుంచి అక్రమ వసూలు చేస్తూ పామాయిల్ ట్యాంకర్లను దారి దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం, గొంతులు కోయడం, హత్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదన్నారు. సర్వేపల్లిలో దేవుడి భూములకు సైతం రక్షణ లేకుండా పోయిందని, చంద్రబాబు, లోకేశ్ కాకుటూరు శివాలయ భూమి ఆక్రమణపై విచారణ జరిపించి, దేవదాయ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూమిపై కన్ను
వెంకటాచలం గ్రామ పంచాయతీ కనుపూరు బిట్–1కు సంబంధించి 0.20 సెంట్లలో కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు సోమిరెడ్డి స్కెచ్ వేశాడని, 952/1 సర్వే నంబర్ భూమిని ప్రభుత్వం ఆధీనం చేసుకోవాలని కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సైతం జిల్లా అధికారులు బేఖాతరు చేశారని, పంచాయతీ తీర్మానంతో సోమిరెడ్డి కోట్ల విలువైన 0.20 సెంట్ల భూమిని కాజేసేందుకు కుట్ర పన్నాడన్నారు. దీనిపై వెంకటాచలం సర్పంచ్ మందల రాజేశ్వరమ్మ తీర్మానాన్ని తిరస్కరించడంతో, ఆమెను తొలగించి, స్పెషల్ అధికారి ద్వారా భూమిని కొట్టేయాలని సోమిరెడ్డి ప్రయత్నిస్తున్నాడని, రైతుల భూములను రియల్ ఎస్టేట్ కోసం చౌకగా కొట్టేయడానికి బెదిరింపులకు దిగుతున్నాడని, భూములను అమ్మనన్న పిడతాపోలూరు రైతులపై కక్షపూరితంగా సాగునీరు ఆపుతానంటూ ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉందన్నారు. గతంలో సోమిరెడ్డి మంత్రిగా కృష్ణపట్నం సిద్ధేశ్వరాలయానికి సంబంధించిన రూ.5 కోట్ల నిధులను ఇతర జిల్లాలోని దేవాలయాలకు మళ్లించాడని, ఇక్కడి అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన నిధులను వేరే జిల్లా దేవాలయాలకు సోమిరెడ్డి ఇచ్చాడన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో సిద్ధేశ్వరాలయానికి చెందిన రూ.2.5 కోట్లను వడ్డీతో సహా వెనుక్కు తెప్పించామని, జగన్‌మోహన్‌రెడ్డికి దేవుని పట్ల, భక్తుల మనోభావాల పట్ల ఉన్న గౌరవం నిబద్ధతకు ఇదో ఉదాహరణ అన్నారు. దేవుడి భూములను కాజేసే వారిని రక్షించడమే సనాతన ధర్మమా అనేది పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. దేవదాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాలోనే దేవుని భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దేవుని భూములను కాపాడాలని దేవదాయ శాఖ మంత్రికి, అధికారులకు, జిల్లా రెవెన్యూ అధికారులను కోరుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే భక్తులతో కలిసి చలో కాకుటూరు కార్యక్రమాన్ని చేపట్టి, దేవాలయ భూములను రక్షించే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు.


