పేద కుటుంబానికి పెద్ద కష్టం
● బాలుడి చేతిలో పేలిన తారాజువ్వ
● వైద్యం కోసం రూ.2 లక్షలు అవసరం
● దాతల సాయం కోరుతున్న కుటుంబం
మర్రిపాడు: మండలంలోని చిన్నమాచనూరు పంచాయతీ పరిధిలోని కదిరినేనిపల్లి గ్రామంలో షేక్.తోహిద్ అనే బాలుడి చేతికి తీవ్రమైన గాయమై, ఇబ్బందులు పడుతున్నారు. దాతల సాయం కోసం బాలుడి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో షేక్.రషీద్, ఆసిఫా దంపతులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండో సంతానం షేక్.తోహిద్ అనే బాలుడు ఇటీవల తారాజువ్వ వెలిగించే క్రమంలో అది ఆకస్మికంగా చేతిలోనే పేలిపోయింది. దీంతో అతని చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు వైద్యానికి సుమారు రూ.2 లక్షలు ఖర్చు అయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు ఆపరేషన్ అవసరమని, దానికి మరో రూ.2 లక్షలు కావాల్సి వస్తుందని వైద్యులు చెప్పారు. దీంతో పేద కుటుంబానికి అంత మొత్తం సమకూర్చే స్థోమత లేకపోవడంతో దాతల సాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. సాయం చేయదలచిన వారు 88977 94623 నంబర్ ద్వారా సంప్రదించాలని వారు కోరారు.
పేద కుటుంబానికి పెద్ద కష్టం


