రెవెన్యూ క్రీడల్లో జిల్లా ముందంజ
నెల్లూరు(అర్బన్): ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ క్రీడల్లో నెల్లూరు జిల్లా రెవెన్యూ క్రీడాకారులు వాకింగ్, రన్నింగ్‌తో పాటు ఇతర క్రీడల్లో ముందంజలో ఉన్నారని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి తెలిపారు. శనివారం నాటికి 26 జిల్లాల యూనిట్లతో పాటు సీసీఎల్‌ఏ యూనిట్లు పాల్గొన్న పోటీల్లో నెల్లూరు జిల్లా 8 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతోందన్నారు. జిల్లాను ముందంజలో నడిపిన క్రీడాకారులకు, అలాగే క్రీడల్లో పాల్గొనేందుకు ప్రోత్సాహం అందించిన కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అభినందనలు తెలిపారు.
రేపట్నుంచి
ఎస్‌ఏ–1 పరీక్షలు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈనెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్–1 పరీక్షలు నిర్వహించనున్నారు. 10న తెలుగు/ఉర్దూ/ కాంపోజిట్ తెలుగు, 11న హిందీ/తెలుగు, 12న ఇంగ్లిష్, 13న మ్యాథ్స్, 14న జనరల్ సైన్స్/ఫిజికల్ సైన్స్, 15న బయాలజికల్ సైన్స్, 17న సోషల్, 18న కాంపోజిట్ సంస్కృత్, 19న ప్రథమ భాష సంస్కృత్ పరీక్షలు జరుగనున్నాయి. ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను లీప్ యాప్‌లో నమోదు చేయనున్నారు. పరీక్షల సమయాలు ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు, 6, 7 తరగతులకు మధ్యాహ్నం 1.15 నుంచి 4.15 గంటల వరకు, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రశ్నపత్రాలను ప్రభుత్వమే సరఫరా చేయనుంది. 1 నుంచి ఐదో తరగతి విద్యార్థుల ప్రశ్నపత్రాలు స్కూల్ కాంప్లెక్స్‌లు, ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థుల ప్రశ్నపత్రాలను ఎమ్మార్సీ కేంద్రాల్లో భద్రరిచారు.
మద్యం షాపులో
అకారణంగా వ్యక్తిపై దాడి
నెల్లూరు(క్రైమ్): గుర్తుతెలియని వ్యక్తి అకారణంగా ఓ వ్యక్తిపై దాడిచేసి గాయపరిచిన ఘటన లక్కీవైన్స్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. సంతపేట ఈద్గామిట్టలో పెయింటర్ ఖాదర్‌బాషా నివసిస్తున్నారు. ఆయన శుక్రవారం రాత్రి పరమేశ్వరినగర్‌లోని లక్కీవైన్ షాపునకు వెళ్లి అక్కడ తనకు తెలిసిన చాంద్‌బాషా, గౌస్‌బాషాలతో మాట్లాడుతుండగా గుర్తుతెలియని వ్యక్తి వారితో ఎందుకు మాట్లాడుతున్నావని ఖాదర్‌బాషాపై దాడి చేశాడు. అనంతరం మద్యం షాపు బయటకు వెళ్తున్న ఖాదర్‌బాషాపై మరోమారు రాయితో దాడిచేశారు. గాయాపాలైన ఆయన జీజీహెచ్‌లో చికిత్స పొంది శనివారం చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బోటు తిరగబడి
మత్స్యకారుడి మృతి
ఉలవపాడు: ప్రమాదవశాత్తు అలల ధాటికి బోటు తిరగబడడంతో మత్స్యకారుడు మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పెదపట్టపుపాళెం గ్రామంలో శనివారం జరిగింది. అందిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వాయల రాజు (38) తన తండ్రి చంద్రయ్యతో కలిసి ఉదయం 4 గంటల సమయంలో సముద్రంలో తన సొంత ఫైబర్ బోటుతో వేటకు వెళ్లారు. చేపల వేట ముగించుకుని ఉదయం 11 గంటల సమయంలో సముద్రం ఒడ్డుకు దగ్గరగా వచ్చిన సమయంలో అలల తాకిడికి బోటు తిరగబడింది. ఈ క్రమంలో బోటులో ఉన్న చంద్రయ్య ఈదుకుని సురక్షితంగా బయటపడగా రాజు నీటిలో పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే పక్కనే ఉన్న మత్స్యకారులు గమనించి అతన్ని ఉలవపాడు సీహెచ్‌సీ వైద్యశాలకు తరలించగా డాక్టర్లు మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉలవపాడు సీహెచ్‌సీ వైద్యశాలలోనే ఉంచారు. ఎస్సై అంకమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. బస్సులకు పర్మిట్, ఎఫ్‌సీ, ఫైర్ ఎక్విప్‌మెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఎగ్జిట్ డోర్స్ వద్ద సీట్లను ఏర్పాటు చేశారా..? ఇలా అనేక అంశాలను పరిశీలించారు. డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా నార్త్, సౌత్ ఇన్‌స్పెక్టర్‌లు రామకృష్ణ, వెంకటరెడ్డిలు మాట్లాడుతూ డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. నిబంధనల ఉల్లంఘనులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
రెవెన్యూ క్రీడల్లో జిల్లా ముందంజ


