కాలక్షేప చర్చలు.. కాలహరణ మాటలు | - | Sakshi
Sakshi News home page

కాలక్షేప చర్చలు.. కాలహరణ మాటలు

Nov 9 2025 6:53 AM | Updated on Nov 9 2025 6:53 AM

కాలక్

కాలక్షేప చర్చలు.. కాలహరణ మాటలు

కీలక శాఖలపై సమీక్షల ఊసేలేదు

అజెండా అంశాల్లో సగంతోనే సరి

మోంథా తుఫాన్‌ నష్టాలపై

మొక్కుబడి హామీలు

అభివృద్ధిపై నిర్దిష్ట ప్రతిపాదనలు,

ప్రణాళికల్లేవ్‌

భోజన విరామ సమయానికి

ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు జంప్‌

మంత్రి నారాయణ ముఖం చూపించి వెళ్లిపోయారు..

జిల్లా ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. కలలు కల్లలయ్యాయి. జిల్లా డెవలప్‌మెంట్‌ రివ్యూ కమిటీ (డీడీఆర్‌సీ) సమావేశం మరోసారి మొక్కుబడిగా ముగిసింది. జిల్లాలో అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధిని స్పష్టం చేసింది. అజెండాలో పొందుపరిచిన అన్ని అంశాలపై చర్చించే తీరిక లేదని ప్రజాప్రతినిధులు మమ అనిపించి మరోసారి రుజువు చేశారు. ప్రధానంగా కీలక శాఖలపై సమీక్షల ఉసేలేకుండా ముగించారు. మోంథా తుఫాన్‌ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఈ అంశంపై విచారం వ్యక్తం చేస్తూ.. సీఎం దృష్టికి తీసుకెళ్తామంటూ హామీలిచ్చారు. వ్యవసాయం, ఇరిగేషన్‌పై చర్చించినప్పటికీ అభివృద్ధిపై ప్రతిపాదనలు, భవిష్యత్‌ ప్రణాళికలు లేకుండానే ఈ అంశాన్ని సరిపెట్టారు.

నెల్లూరు (పొగతోట): రాష్ట్ర అసెంబ్లీ తర్వాత ఎంతో ప్రాధాన్యత ఉన్న డీడీఆర్‌సీ సమావేశాన్ని ప్రజాప్రతినిధులు నీరుగార్చుతున్నారు. గతంలో డీడీఆర్‌సీ సమావేశాలు ఆధ్యంతం వాడీవేడిగా జరిగేవి. కాలక్షేపం చర్చలు, కాలహరణ మాటలతో మొక్కు బడిగా ముగించి జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉన్న చిత్తశుద్ధి ఎంతో చెప్పకనే చెబుతున్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధ్యక్షతన డీడీఆర్‌సీ నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయం, ఇరిగేషన్‌, జాతీయ రహదారులు, వైద్య, ఆరోగ్య, విద్య, హౌసింగ్‌ శాఖలతోపాటు పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలపై చర్చించేందుకు అజెండా రూపొందించారు. అయితే వ్యవసాయం, ఇరిగేషన్‌, హౌసింగ్‌, జాతీయ రహదారులపై మాత్రమే కాలక్షేప చర్చలు సాగించారు. ప్రధానంగా జిల్లాలో మోంథా తుఫాన్‌ ప్రభావంతో పంటలు తీవ్రస్థాయిలో దెబ్బతిని రైతులు రూ.కోట్లలో నష్టపోయారు. రోడ్లు దెబ్బతిన్నాయి. రైతులను పూర్తిస్థాయిలో అదుకుంటామని, తుపాను నష్టాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామంటూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ మొక్కుబడి హామీ ఇచ్చి సరిపెట్టారు. సమయం లేదని జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం పేరుతో జిల్లాలో సాగునీటి కేటాయింపులు ప్రకటించి ఇరిగేషన్‌పై సమీక్షను సైతం ఇలా మమ అనిపించారు. జిల్లాలో రబీ సీజన్‌ ప్రారంభమవుతున్నా.. ఇరిగేషన్‌ కాలువల్లో పూడిక తీత పనులపై ప్రతిపాదనలు, ప్రణాళికలకు అతీగతీ లేకుండానే పూర్తయింది. ఇక హౌసింగ్‌పై చర్చ కూడా అంతంత మాత్రంగానే జరిగింది. ఇళ్ల నిర్మాణాలపై విజిలెన్స్‌ విచారణ జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. విచారణలు సరే.. కొత్త ఇళ్లు కేటాయించాలంటూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మంత్రులను అడిగారు.

మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం..

మంత్రి ఆనం మాట్లాడుతూ మోంథా తుఫాన్‌కు అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వ్యవసాయం, ఇరిగేషన్‌, రోడ్లు, మంచినీటి సరఫరా వ్యవస్థలన్ని దెబ్బతిన్నాయన్నారు. తుఫాన్‌ తీవ్రతపై 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో సీఎం ఎదుట చర్చిస్తామని తెలిపారు. యూరియా, విత్తనాల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు, బోర్ల కింద పంటలు సాగు చేస్తున్న రైతులకు కార్డులు అందించి సకాలంలో యూరియా, ఎరువులు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. మత్స్యకారుల అభివృద్ధికి సబ్సిడీపై పెద్ద బోట్లు అందజేస్తామన్నారు. జెడ్పీ చైర్మన్‌గా ప్రజలకు సేవ చేసిన దివంగత నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేరును నూతన జెడ్పీ భవనానికి పెట్టాలని, జెడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలన్నారు.

ఎన్‌హెచ్‌ అధికారుల తీరుపై ఆగ్రహం

నేషనల్‌ హైవే అధికారులపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇష్ట ప్రకారం రోడ్లు వేసుకుంటూ పోతుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఎన్‌హెచ్‌ అథారిటీ అధికారులను నిలదీశారు. జాతీయ రహదారులపై వరుసగా ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టించుకోరా అంటూ మంత్రి ఆనంతోపాటు కావలి, కోవూరు, ఉదయగిరి ఎమ్మెల్యేలు అఽధికారులను ప్రశ్నించారు.

సోమిరెడ్డి ఆక్రోశం..

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి నేషనల్‌ హైవేలకు గ్రావెల్‌ తరలిస్తున్నారన్నారు. అయితే సోమిరెడ్డి రూ.వందల కోట్లు దోచుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతుందని, మనశ్శాంతి లేకుండా పోతుందని ఆక్రోశం వ్యక్తం చేశారు. కనుపూరు కాలువ కింద 66 వేల ఎకరాలు సాగులో ఉంటే 25 వేల ఎకరాలే అని ఇరిగేషన్‌ అధికారులు ఏ విధంగా లెక్కిస్తారంటూ ప్రశ్నించారు.

అన్నదాత సుఖీభవ కొందరికేనా?

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ద్వారా అందరికీ నగదు పడలేదన్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి అందరికి నగదు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

చివరి ఆయకట్టు వరకు సాగునీరివ్వండి..

ఎమ్మెల్సీ టి.మాధవరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెన్నయపాళెం, కరేడు, చేవూరు ప్రాంతంలో భూ సేకరణ జరుగుతుందన్నారు. ఆయా ప్రాంతాలకు నాటి కేటాయింపులు చేస్తారా? లేదా అని ప్రశ్నించారు. గత డీడీఆర్‌సీలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు, పరిష్కారాలు చూపలేదన్నారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ హాజరై ముఖం చూపించి వెంటనే వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యేలు ప్రశాంతిరెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్‌, శ్రీధర్‌రెడ్డి, సోమిరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ మొగిలి వెంటేశ్వర్లు, జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓ శ్రీధర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కాలక్షేప చర్చలు.. కాలహరణ మాటలు 1
1/2

కాలక్షేప చర్చలు.. కాలహరణ మాటలు

కాలక్షేప చర్చలు.. కాలహరణ మాటలు 2
2/2

కాలక్షేప చర్చలు.. కాలహరణ మాటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement