
ఉరితాళ్లతో మున్సిపల్ కార్మికుల నిరసన
నెల్లూరు (బారకాసు): నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కార్మికుల కడుపులు కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం పిలిచిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆదివారం బాలాజీనగర్ సీపీఎం ఆఫీస్ సెంటర్ నుంచి పూలేబొమ్మ వరకు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని మా కడుపులు కొట్టొద్దు. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించొద్దు అంటూ నినాదాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ నెల్లూరు నగర నాయకులు కాయంబు శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి. కామాక్షమ్మ, నాయకులు సలోమి మాట్లాడారు. 13 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే నిమ్మకు నీరెత్తిన్నట్లు కూటమి ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా కార్మికుల జీవితాలు, ప్రజల ఆరోగ్యాలు ఇబ్బందుల్లో పడుతున్నాయన్నారు. కాంట్రాక్టర్లకు కార్పొరేట్ కంపెనీలకు కార్మికుల కష్టాన్ని, ప్రభుత్వ సంపదను దోచిపెట్టే విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. సంవత్సరాల తరబడి కార్మికులుగా ఉన్న వారిని కాంట్రాక్టర్ కింద బానిసలుగా మార్చడం బ్రిటిష్ పాలనలోకి తీసుకు వెళ్లడమేనని విమర్శించారు. తక్షణమే పిలిచిన టెండర్లను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు కాపాడుకునేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, సీఐటీయూ నెల్లూరు నగర నాయకులు పి సూర్యనారాయణ,కేవీ రమణారెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు భాగ్యమ్మ, కొండమ్మ, చంద్రమ్మ, షబ్బీర్, మనోజ్, రమేష్, రాంబాబు, ముని మోహన్‌బాబు, బాలు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.