
తమ్ముళ్ల గ్రావెల్ దందా
కావలి (జలదంకి): కావలిలో టీడీపీ నేతల దందా పరాకాష్టకు చేరింది. కావలి మండలంలోని చెరువుల్లో నీరు అడుగంటడంతో కొద్ది రోజులుగా పగలు రాత్రి తేడా లేకుండా యంత్రాలు పెట్టి ట్రాక్టర్లలో గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. రుద్రకోట, కొత్తపల్లి, ఆముదాలదిన్నె తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు చేప డుతున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆముదాలదిన్నె చెరువులో మూడు జేసీబీలు పెట్టి దాదాపు 70 ట్రాక్టర్లతో గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. ఇటీవల కొత్తపల్లి చెరువులో గ్రావెల్ అక్రమ తరలింపుపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా సంబంధిత అధికారులు గ్రావెల్ అక్రమ దందాను అడ్డుకోలేదు. గ్రావెల్ అక్రమ రవాణాపై అధికారుల చర్యలు లేకపోవడంతో పగలు, రాత్రి తేడా లేకుండా గ్రావెల్ అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగిస్తూ తెలుగు తమ్ముళ్లు లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ ఏఈ హరీష్‌ను వివరణ కోరగా గ్రావెల్ తరలింపునకు అనుమతులు ఇచ్చామన్నారు. 70 ట్రాక్టర్లతోపాటు మూడు జేసీబీలతో గ్రావెల్ తరలింపునకు ఎలా అనుమతి ఇస్తారని అడుగగా ఫోన్ కట్ చేశారు.